హైదరాబాద్: కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగమే తనపై కేసు నమోదైందని బెల్లంకొండ సురేష్ తెలిపాడు. శరణ్ అనే వ్యక్తి 85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ తనపై ఆరోపణలు చేయడంతో బెల్లంకొండ స్పందించారు. తనకు శరణ్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదని, కొడుకుతో పాటు తనపై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. శరణ్ ఒక్క పైసా తమకు ఇవ్వలేదని, డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు చూపించాలన్నారు.
శరణ్ తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారని, శరణ్ డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తానని హెచ్చరించారు. బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడుతున్నారని, పోలీసుల విచారణకు సహరిస్తానన్నారు. తనని బ్యాడ్ చేయడానికి శరణ్ ఆరోపణలు చేస్తున్నారని, కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశామని, అతడి దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్ కు నోటీసులు ఇచ్చారన్నారు. తన పిల్లలు జోలికి వచ్చాడని, పిల్లలంటే తన పంచ ప్రాణాలు అని, శరణ్ ను లీగల్ గా ఎదుర్కొంటానని, అతని పై పరువు నష్టం దావా వేస్తానని, ఏదైనా ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలని బెల్లంకొండ సవాలు విసిరారు.
తనకు కోర్టు నుండి కాని సిసిఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని, తనపై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారని, తనపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్ కు నోటీసులు ఇచ్చామని, శరణ్ ది మా ఊరేనని, పదేళ్ళ క్రితం పరిచయం ఉందని, టికెట్ల కోసం ఫోన్ చేస్తూ ఉండేవాడన్నారు. శరణ్ అనవసరంగా తన కొడుకు పేరును బ్లేమ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని క్షమించమని వేడుకున్నా తాను ఊరుకోనని, బ్లాక్ మెయిల్ ల్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని, శరణ్ వెనకాల ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడు.. అతనెవరో బయట పెడతానని హెచ్చరించారు.