సాక్షాలు ఉంటే తీసుకురావాలి
పోలీసుల విచారణకు సహకరిస్తా
తనకు సిసిఎస్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు
నా కొడుకు జోలికొస్తే ఊరుకోను
ఛీటింగ్ కేసుపై బెల్లంకొండ సురేష్
హైదరాబాద్: తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, తప్పుడు కేసు నమోదు చేశారని సినీనిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. టాలీవుడ్ హీరో బెల్లంకొం సురేష్, శ్రీనివాస్‌పై కోర్టు ఆదేశాల మేరకు సిసిఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. సినీ నిర్మాణం కోసం తన వద్ద రూ.85లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని శరన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. దీనిపై నిర్మాత బెల్లకొండ సురేష్ ఫిల్మ్ ఛాంబర్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తన ఇద్దరు కుమారులు శ్రీనివాస్, గణేష్‌ను ఇబ్బంది పెట్టేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. శరన్ అనే వ్యక్తి కావాలనే ఆరోపణలు చేస్తున్నాడని, నా పిల్లలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని అన్నాడు. తనను, తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది పన్నిన కుట్రలో భాగంగానే కేసు నమోదయిందని అన్నారు. తనకు శరన్ ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని, నా కుమారుడిపై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
శరన్ తనకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, డబ్బులు ఇచ్చినట్లు సాక్షాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలని, శరన్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్రపన్నారని అన్నారు. తనకు డబ్బులు ఇచ్చినట్లు సాక్షాలు చూపించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తన కుటుంబం ఎదుగుదల చూడలేకనే కేసులు పెడుతున్నారని, పోలీసుల విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. తనకు కోర్టు, సిసిఎస్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని, తనపై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారని తెలిపారు. శరన్ తన గ్రామానికి చెందిన వాడేనని, పదేళ్ల క్రితం పరిచయమయ్యాడని, టికెట్ల కోసం ఫోన్ చేస్తు ఉండేవాడని తెలిపారు. శరన్ వెనుక ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడని, త్వరలోనే అతడి పేరు బయటపెడతానని చెప్పాడు.