హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రధాన నగరాలు పట్టణాల్లో మిద్దెతోటల సాగుకు ఆదరణ పెరిగిందని రాష్ట్ర ఉద్యానశాఖ విశ్రాంత డైరెక్టర్ మధుసూదన్ వెల్లడించారు. ఉద్యాన శాఖ అధ్వర్యంలో అర్బన్ ఫార్మింగ్‌పై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మధుసూదన్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వంటింటి అవసరాలను తీర్చుకునేందుకు పట్టణాల్లో మిద్దెతోటల సాగుపట్ల మహిళలు అధికంగా మక్కువ చూపుతున్నారన్నారు. మిరప, టమాటా,క్యాబేజి ,కాలీప్లవర్ వంకాయ ,బెండకాయ వంటి కూరగాయలు,బీర, సోర,కాకర వంటి తీగజాతి కూరగాయల పెంపకంతోపాటు వివిధ రకాల పండ్ల మొక్కలు,ఔషధ మొక్కలను మిద్దెలపైనే పెంచుకుంటున్నారన్నారు.
వీటి పెంపకం ద్వారా ఇంటి అవసరాలు తీరటమే కాకుండా పచ్చటి ఆరోగ్యకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుందన్నారు. ఏడిఏ విజయలక్ష్మి మాట్లాడుతూ మిద్దె తోటల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉద్యాన శాఖ శిక్షణ సంస్థ మిద్దెపై ఉన్న మాడల్ మిద్దెతోటను సందర్శించారు. శిక్షణలో పాల్గొన్న పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తిరిగి ఈ నెల 27న మిద్దెతోటల సాగుపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్విహించనున్నట్టు ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు.