నాలుగు రాష్ట్రాల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నట్టు రూఢి కాడంతోనే ముఖ్యంగా అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ లభించడంతోనే ప్రధాని నరేంద్ర మోడీ అత్యుత్సాహానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల అద్దంలో 2024 సాధారణ ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయని ఆయన సంబరపడిపోయారు. అతి పెద్ద రాష్ట్రంలో చరిత్రాత్మకమైన విజయం లభించిందని చెప్పుకున్నారు. 2017 యుపి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించినప్పుడు చాలా మంది అందులో 2019 నాటి లోక్‌సభ ఎన్నికల గెలుపును చూశారని ఇప్పుడు కూడా అదే వర్తిస్తుందని ఆయన అన్నారు. కాని ఈసారి యుపి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నుంచి బిజెపికి గట్టి పోటీ ఎదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ సీట్లను బిజెపి గెలుచుకోగలిగింది. ఓట్లపరంగా అది కొంత ప్రయోజనం పొందినా ఎస్‌పి ఓట్ల శాతం అంతకు అనేక రెట్లు పెరిగింది. ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ అన్నట్టు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తదుపరి జరగబోయే సాధారణ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబిస్తాయనడం బొత్తిగా నిలబడని వాదన. అసెంబ్లీ ఎన్నికలకూ, పార్లమెంటు ఎన్నికలకూ ఏ విషయంలోనూ పొంతన వుండదు. అత్యధికంగా 80 మంది సభ్యులను లోక్‌సభకు పంపిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ప్రాభవం దేశాధికారాన్ని చేజిక్కించుకోడంలో దానికి తోడ్పడుతుందనడం సమంజసమే కావచ్చు. అయితే 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే యుపిలో ఈసారి బలహీనపడిన బిజెపిని మరి రెండేళ్లకు అంటే 2024 నాటికి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పెరగగల ప్రభుత్వ వ్యతిరేకత మరింత దెబ్బ తీసే అవకాశాలే ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికలలో చర్చకు వచ్చే సమస్యలు వేరు, పార్లమెంటు ఎన్నికలలో ప్రజల దృష్టి కేంద్రీకృతమయ్యే వ్యవహారాలు వేరు. అందుచేత రెండు సందర్భాల్లోనూ ప్రజలు ఒకే రకంగా ఓటేసే అవకాశాలుండవు. ప్రజల దృష్టిని తన పార్టీ వైపు మళ్లించుకోడానికి, దేశానికి బిజెపి తప్ప గత్యంతరం లేదనే అభిప్రాయాన్ని గట్టిగా నాటగలననే భ్రమతో మాత్రమే ప్రధాని మోడీ యుపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 2024 నాటి సాధారణ ఎన్నికల ఫలితాలను చూపించడానికి సాహసించారు. అంతేగాని అందులో వాస్తవం లేదు. అసెంబ్లీల ఎన్నికల్లో విజయాలు రాజ్యసభ ఎన్నికల్లోనూ, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఆయా పార్టీలు లబ్ధి పొందడానికి దోహదం చేస్తాయి. ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో అక్కడ ఎన్నికైన శాసన సభ్యులొక్కొక్కరి ఓటు విలువ అత్యధికంగా 208 వుంటుంది. కనుక ఆ మేరకు ఆ రాష్ట్రంలో సంపాదించుకునే అసెంబ్లీ సీట్ల సంఖ్య అక్కడి పార్టీలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ విధంగా చూసుకున్నా యుపిలో గత అసెంబ్లీ కంటే ఇప్పటి శాసన సభ బిజెపికి నష్టదాయకమే. ఇతర మూడు రాష్ట్రాల్లోనూ గెలుపొందినందున ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు రాష్ట్రపతి ఎన్నికల్లో దానికి ఉపయోగపడతాయి. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యాన్ని మరింత పెంచిన మాట వాస్తవం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన అసాధారణ ఓటమి దాని భవిష్యత్తును దెబ్బ తీసే విధంగా వున్నది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా ప్రస్తావించుకోదగినది. కాంగ్రెస్ తగినంతగా ఆసక్తి కనపరచడంలేదని కేంద్రంలో బిజెపిని గద్దె దింపే విషయంలో దాని మీద ఆధారపడడం మానుకోడమే మంచిదని ఆమె అన్నారు. అది ముమ్మాటికీ వాస్తవం. ప్రతిపక్షంలోని పార్టీలన్నీ కలిసి కట్టుగా బిజెపితో తలపడవలసిన అవసరాన్ని మాయావతి సరైన సందర్భంలో గుర్తు చేశారు. బిజెపికి జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ తన ప్రాధాన్యతను మరింత కోల్పోయింది. ఆ ఖాళీని పూరించి కాషాయ పార్టీకి దీటైన ప్రత్యామ్నాయ శక్తిని నిర్మించి 2024 సాధారణ ఎన్నికల నాటికి దానికి ఓటమి భయాన్ని కలిగించగల శక్తియుక్తులు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకే వున్నాయి. టిఆర్‌ఎస్, డిఎంకె, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, ఆర్‌జెడి తదితర ప్రాంతీయ పక్షాలు గట్టిగా తలచుకుంటే మహా ఘట్‌బంధన్‌గా బలమైన సంఘటిత శక్తిగా తయారై భవిష్యత్తు రాజకీయాలను అసాధారణ స్థాయిలో ప్రభావితం చేయగలవు. ప్రజలను విడదీసి సెక్యులర్ రాజ్యాంగ నీతిని బలి తీసుకుంటున్న మతతత్వ పీడ నుంచి దేశాన్ని కాపాడగలవు. జాతి ముందు సరికొత్త అజెండానుంచి దేశ ప్రజల్లో నవ చైతన్యాన్ని ఉద్దీపన చేయగలవు. అభివృద్ధి పథంలో దేశాన్ని పరుగులు తీయించగలవు. ఈ వైపుగా వీలైనంత త్వరలో ప్రాంతీయ పక్షాల వేదిక నిర్మాణం జరగాలని, ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ కార్యాచరణ ఊపందుకోవాలని ఆశిద్దాం.
BJP Win in UP Assembly Election 2022