న్యూఢిల్లీ : కరోనా కొత్త కేసులు, మరణాలు బాగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా, మరణాలు భారీ సంఖ్యలో తగ్గడం ఊరట కలిగిస్తోంది. శనివారం 7,61,737 కరోనా పరీక్షలు చేయగా, 3,116 కొత్త కేసులు బయటపడ్డాయి. మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది. అంతకు ముందు రోజు 89 మరణాలు నమోదు కాగా, శనివారం 47 కు తగ్గాయి. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 5,15,850 కు చేరింది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. శనివారం కొవిడ్ నుంచి 5,559 మంది కోలుకోగా, ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. ఆ రేటు 98.71 శాతానికి మెరుగైంది. క్రియాశీల కేసులూ గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 38,069(0.09శాతం) యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సంబంధించి శనివారం 20,31,275 మంది టీకాలు వేయించుకోగా, ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 180 కోట్లు దాటింది.