55 ఏండ్లు దాటిన వారు ఎక్కువే
న్యూఢిల్లీ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజేతలైన ఎమ్మెల్యేలలో 55 సంవత్సరాలు దాటిన వారి సంఖ్య పెరిగింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో ఎమ్మెల్యేలయిన వారి వయస్సు వివరాల విశ్లేషణలో ఈ అంశం వెల్లడైంది. ఈ విధంగా ఈసారి అసెంబ్లీలు వృద్ధుల ముఖచిత్రాన్ని సంతరించుకుంటున్నాయి. పిఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రిసర్చ్ విశ్లేషణలో ఇతర కీలక విషయాలతో పాటు ఈ 55 ఏండ్లు ప్లస్ విషయం వెలుగులోకి వచ్చింది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో 55 ఏండ్ల వయస్సు అంతకు తక్కువ వయస్సు వారు 64.7 శాతం వరకూ ఉన్నారు. ఈసారి ఇది 59.5 శాతానికి తగ్గింది. ఇక గత అసెంబ్లీలతో పోలిస్తే ఈసారి అసెంబ్లీలో ఎక్కువ మంది మహిళలు ఎమ్మెల్యేలుగా కన్పించనున్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఇంతకు ముందు 42 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పుడు వీరి సంఖ్య 47కు చేరుకుంది. ఉత్తరాఖండ్‌లో ఇంతకు ముందు ఐదుగురు మహిళలు ఉండగా ఇప్పుడు ఇది ఎనిమిదికి చేరుకుంది. మణిపూర్ అసెంబ్లీలో ఈ సంఖ్య ఇంతకు ముందు ఇద్దరే మహిళా ప్రతినిధులు ఉండగా ఇది ఇప్పుడు నాలుగుకు చేరింది. డిగ్రీ వరకూ చదివిన ఎమ్మెల్యేల సంఖ్య ఇంతకు ముందు 72 శాతం ఉండగా, ఇది ఇప్పుడు 75 శాతం దాటింది. ఉత్తరాఖండ్‌లో ఈ పరిణామం విశ్లేషిస్తే ఇది తగ్గింది. ఇంతకు ముందటి అసెంబ్లీలో ఇది 77 శాతం వరకూ ఉండగా ఇది ఇప్పుడు 68 శాతానికి పడిపోయింది. మణిపూర్‌లో ఈసారి డిగ్రీ ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య గణనీయంగా తగ్గింది.