అర్థరాత్రి భారీ స్థాయిలో సోదాలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న ఆరుగురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. భోపాల్‌లోనే రెండు ప్రాంతాలలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు ఆదివారం తెలిపాయి. వీరి కదలికలపై అనుమానాలు తలెత్తాయి. సోదాచేయగా వీరి వద్ద కీలక సమాచారపు ల్యాప్‌ట్యాప్‌లు, మత సాహిత్యం, పేలుడు పదార్థాలు ఉన్నాయని తేలింది. ఉగ్రవాదులు ఉంటున్న రహస్య స్ధావరాలపై ఉగ్రవాద నిరోధక దళం, కేంద్ర దర్యాప్తు సంస్థల వారు స్థానిక పోలీసుల సాయంతో కలిసి దాడులు జరిపారు. ఉగ్రవాదులలో ఓ స్థావరం నగరంలోని ఓ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఉందని తేలింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము సమయాలలో కరోండ్, ఐష్‌బాగ్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల అరెస్టులు జరిగాయి. అరెస్టు అయిన వారిలో ఇద్దరిని స్థానికులుగా గుర్తించారు. 60 మంది వరకూ సాయుధ బలగాలతో ఈ రెండు ప్రాంతాలకు చేరుకుని, చాలా సేపటివరకూ తనిఖీలు నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది.