లేకుండా సీనియర్లకు అన్యాయం జరుగుతుంది
శాక్స్ ఉద్యోగుల ఆవేదన
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (శాక్స్)లో ఉద్యోగుల బదిలీలు చేపట్టకుండా కాంట్రాక్ట్ పద్దతిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాక్స్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ల్యాబ్ టెక్నిషీయన్లు, కౌన్సిలర్స్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రాజెక్ట్ డైరెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఇదివరకు పోస్టుల భర్తీకి ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ బదిలీలు చేపట్టేవారు. సీనియార్టీ, ఆయా జిల్లాల్లోని డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల బదిలీలు చేపట్టేవారు. కానీ తాజాగా ఆ విధానానికి స్వస్తిపలికి, బదిలీలు చేపట్టకుండానే నోటిఫికేషన్ విడుదల చేసినట్టు సొసైటీలో కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బదిలీలు చేపట్టకుండానే, నియామకాలు చేపడితే జిల్లాలో ఉన్న కొందరు సీనియర్లకు అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న సీనియర్లను బదిలీ చేసిన తర్వాత ఏర్పడిన ఖాళీలను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం పాత మార్గదర్శకాలను పక్కన పెట్టి, నోటిఫికేషన్ జారీ చేయడంతో తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో పని చేస్తున్న కొందరు సీనియర్లు బదిలీలు చేపట్టాలని కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదనీ, బదిలీ విషయమై ఉన్నతాధికారులను ఆశ్రయిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని కూడా బదిలీలు చేయడం లేదని చెబుతున్నారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు.