60శాతం మరణాలు జరుగుతున్నట్లు వైద్యశాఖ వెల్లడి
శారీరక శ్రమ లేకపోవడంతో పెరుగుతున్న మధుమేహం, క్యాన్సర్ రోగులు
ప్రజలు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని వైద్యుల సూచనలు
మన తెలంగాణ,సిటీబ్యూరో: జిల్లాలో జీవనశైలి వ్యాధులు చాపకింది నీరులా వ్యాపించి 60శాతం మరణాలకు కారణమైతున్నాయని వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటి తెలిపారు. జీవనశైలి వ్యాధులపై జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వే ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్యకార్డు అందుబాటులోకి రానుందన్నారు. వ్యాధులపై అవగాహన, వ్యక్తిగత హెల్త్ ప్రోపైల్ తయారీ, నిర్వహణపై శిక్షణనివ్వటానికి, ఒక రోజు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈశిక్షణ కార్యక్రమంలో పాల్గొన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, బస్తీ దవఖానాల వైద్యాధికారులు,స్టాప్ నర్సులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత సమాజంలో ప్రజల పనిఒత్తిడి, సమస్యలతో బాధపడుతున్నారని, శారీరక శ్రమలేని ఒత్తిడి కారణంగా రక్తపోటు, మధుమేహం, కాన్సర్,గుండెజబ్బులు వ్యాపించి, అంటు వ్యాధులకంటే అధికంగా జీవనశైలి వ్యాధులతో ప్రజలు మరణిస్తున్నారని వీటిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ఆహార అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎన్‌సిడిఅధికారి డా. ఆశ్రితారెడ్డి, ఎస్‌ఓ ఆనంద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.