పూర్ణాహుతికి హాజరైన స్పీకర్ పోచారం, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, నేతలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్‌కి అనారోగ్య సమస్యలు తొలగి.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మృత్యుంజయ హోమం నిర్వహించారు. సోమవారం మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఇటీవల సిఎం కెసిఆర్ హఠాత్తుగా అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి తిరిగి పొందాలని కోరుకుంటూ ఈ మృత్యుంజయ హోమాన్ని ఆమె జరిపారు.
ఉదయం 5 గంటలకు ప్రారంభమైన మృత్యుంజయ హోమం పూర్ణాహుతికి రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎంపి మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సురభి వాణీదేవి,తక్కెళ్లపల్లి రవీందర్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, మహబూబాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ కుమారి బిందు, ఉషా దయాకర్‌రావు, టిఆర్‌ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నూకల రంగారెడ్డి, సురేశ్‌రావు, రామ్‌నాయక్, సిరినాయక్, వనజాశ్రీరామ్, తదితరులు హాజరై, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.