ఉడుపి ముస్లిం విద్యార్థినుల స్పష్టీకరణ
ఉడుపి(కర్నాటక): తరగతి గదుల్లో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తమ పోరాటాన్ని కొనసాగించాలని ఉడుపిలోని ముస్లిం విద్యార్థినులు నిర్ణయించుకున్నారు. హిజాబ్ ధరించకుండా తాము కళాశాలకు వెళ్లేది లేదని, తమకు న్యాయం లభించేవరకు న్యాయపరంగా పోరాటాన్ని కొనసాగిస్తామని మంగళవారం వారు స్పష్టం చేశారు. కర్నాటక హైకోర్టు తీర్పును రాజ్యాంగ విరుద్ధంగా వారు అభివర్ణించారు. కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని, హిజాబ్ లేకుండా కళాశాలకు వెళ్లే ప్రసక్తి లేదని మంగళవారం ఉడుపిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఒక విద్యార్థిని స్పష్టం చేశారు. న్యాయపరమైన అన్ని మార్గాలను వెతుకుతామని, న్యాయం కోసం, తమ హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆమె తెలిపారు. నేడు వచ్చిన తీర్పు రాజ్యాంగవిరుద్ధమైనదని, తన మతాన్ని పాటించడానికి, తనకు నచ్చిన వస్త్రధారణను ఎంచుకోవడానికి రాజ్యాంగం తనకు హక్కులు కల్పించిందని ఆ విద్యార్థిని తెలిపారు. హిజాబ్ తమ మతంలో అత్యంత ముఖ్యమైన భాగమని ఆమె పేర్కొన్నారు.