74మంది పిసిలకు హెచ్‌సిలుగా పదోన్నతి
పదోన్నతి బ్యాడ్జిలను అలంకరించిన సిపి మహేష్ భగవత్
హైదరాబాద్ : పనితీరుతోనే సమాజంలో పోలీసులకు గౌరవం దక్కుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 74మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వారికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ బాడ్జిలను అలంకరించారు. ఈ సందర్భంగా సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ పదోన్నతి పొందిన వారు మరింత బాధ్యతతో పనిచేయాలని కోరారు. పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుందని అన్నారు.
పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పోలీసుల కోసం ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. పోలీసుల పిల్లలకు బైజూస్ సహకారంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సివిల్ సర్వీస్‌కు సన్నద్ధం అవుతున్న వారి కోసం శిక్షణ ఇస్తామని తెలిపారు. గత ఏడాది తమ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న వారు విజయం సాధించారని తెలిపారు. ప్రజలకు పోలీసులు సర్వీస్ చేయాలని అన్నారు. సమాజంలో శాంతిభద్రతలు ఉండేలా పోలీసులు కృషి చేయాలని కోరారు. పదోన్నతి పొందిన వారిలో 70మంది పురుషులు, నలుగురు ఉమెన్ కానిస్టేబుళ్లు ఉన్నారు. కార్యక్రమంలో ఎడిసిపి అడ్మిన్ శ్రీనివాస్, భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.