ప్రభుత్వ సిబ్బంది పనివేళలో సొంత అవసరాలకు సెల్‌ఫోన్ వాడరాదు : మద్రాస్ హైకోర్టు తీర్పు
చెన్నై : ప్రభుత్వ సిబ్బంది ఆఫీస్ పనివేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌ఎం సుబ్రమణియమ్ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేగాక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుచిరాపల్లి లోని హెల్త్ రీజినల్ వర్క్‌షాపు విభాగంలో సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి ఇటీవల ఆఫీసులో తోటి ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోక పోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు.
అతడి పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది. ఆఫీసుల్లో మొబైల్ ఫోన్లు వినియోగిస్తుండటం, ఫోన్లలో వీడియోలు తీయడం వంటివి తోటి ఉద్యోగులకు అసౌకర్యం కలిగించడమే కాక, ప్రభుత్వ ఆఫీసుల్లో కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. అందువల్ల ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. సిబ్బంది వీలైతే మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేయా లి. లేదా వైబ్రేషన్ / సైలెంట్ మోడ్‌లో పెట్టాలి. అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే పై అధికారుల అనుమతి తీసుకుని ఆఫీస్ నుంచి బయటకు వెళ్లి మాట్లాడి రావాలని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సర్కులర్ జారీ చేయాలని ఆదేశించింది.