రసపట్టులో ఆసీస్-పాక్ రెండో టెస్టు
కరాచీ: పాకిస్థాన్‌ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసపట్టుగా మారింది. 506 పరుగుల భారీ లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన పాకిస్థాన్ మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక చివరి రోజు విజయం సాధించాలంటే పాకిస్థాన్ మరో 314 పరుగులు చేయాలి. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్ (1), వన్‌డౌన్‌లో వచ్చిన అజహర్ అలీ (6) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. దీంతో పాకిస్థాన్ 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.
ఈ దిశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ బాబర్ ఆజమ్, ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ తమపై వేసుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. సమన్వయంతో ఆడుతూ జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన షఫిక్ 226 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజమ్ అజేయ శతకం సాధించాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన బాబర్ 197 బంతుల్లో 12 ఫోర్లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో షఫిక్‌తో కలిసి మూడో వికెట్‌కు 171 అజేయంగా 171 పరుగులు జోడించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యంతో పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 556 పరుగులు చేసి డిక్లేర్డ్ చేయగా, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే ఆలౌటైంది.