రాష్ట్రపతి ఎన్నికల బలంపై మమత
కోల్‌కతా : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినప్పటికీ రాష్ట్రపతి ఎన్నిక బిజెపికి నల్లేరు మీద నడక అనుకోరాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పారు. దేశవ్యాప్తంగా లెజిస్లేటర్ల బలాన్ని బిజెపి లెక్కలోకి తీసుకుని తీరాలి. ఈ పార్టీకి మొత్తం లెజిస్లేటర్లలో కనీసం సగం బలం లేదని, బిజెపి నిలబెట్టే అభ్యర్థి విజయం సునాయాసం అవుతుందని భావించుకోవడం కలే అవుతుందని చెప్పారు. ఈ కోణంలో చూస్తే ఆట ఆగిపోలేదు. ఆట అయిపోలేదని బిజెపి గ్రహించాల్సి ఉందన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బిజెపి గొప్పగా చిత్రీకరించుకుంటూ, ఇతరత్రా కీలక ఎన్నికలపై దీని ప్రభావాన్ని చూపేలా చేస్తోందని మమత వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఎలక్టోరల్ కాలేజ్ ప్రక్రియలో జరుగుతుంది. అసెంబ్లీల సభ్యుల ఓట్లను నిష్పత్తి ప్రాతిపదికన ఖరారు చేస్తారు.
ఈ కోణంలో చూస్తే లెజిస్లేటర్ల బలం బిజెపికి పెద్దగా ఏమీ లేదు. యుపి ఎన్నికలలో సమాజ్‌వాది పార్టీ ఓటమి చెందినా ఇంతకు ముందటి కన్నా ఎక్కువ స్థానాలతో బలోపేతం అయిందని మమత విశ్లేషించారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉందని, ఇప్పటికిప్పుడు బిజెపికి గేమ్ అయిపోయిందనుకోరాదని మమత తేల్చిచెప్పారు. ఎంపిలు, లెజిస్లేచర్ల ఓట్లతో కూడిన లెక్కలతో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఈ కోణంలో బిజెపి తాను అనుకున్న అభ్యర్థి ఎవరైనా గెలిచితీరుతారని అనుకుంటే అది రాజకీయ పొరపాటే అవుతుందని తేల్చిచెప్పారు.