మిషన్ భగీరధ అధికారులకు ఇఎన్‌సి ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఎండాకాలంలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా చూసేందుకు మిషన్ భగీరథ విభాగం సమాయత్తమైంది. ఇందులో భాగంగా మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండే ఆవాసాలకు అంతరాయాలు లేకుండా తాగునీటిని సరాఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఇఎన్‌సి కృపాకర్‌రెడ్డి వీడియా కాన్ఫెరన్స్ నిర్వహించారు. ఇందులో అన్ని జిల్లాల చీఫ్ ఇంజనీర్లు, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఇఎన్‌సి దిశానిర్దేశం చేశారు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు సరిపోయేంత ఉన్నాయన్న ఆయన… రాబోయే మూడు నెలలు మిషన్ భగీరథలోని ప్రతీ ఒక్క ఇంజనీర్ హై అలర్ట్‌గా ఉండాలన్నారు. ఇంటెక్ వెల్స్, ట్రీట్ మెంట్ ప్లాంట్‌లలోని పంపింగ్ స్టేషన్లను ఇఇ స్థాయి అధికారులు తరుచుగా పరిశీలించాలని ఆదేశించారు. మోటార్లు, పంపులకు ఏమైనా మరమ్మత్తు సమస్యలు ఉంటే వెంటనే సరిచేయాలన్నారు. దీంతో పాటు భగీరథ పైప్ లైన్ వ్యవస్థ, ఎయిర్‌వాల్వ్‌ల తనిఖీ ప్రక్రియ నిరంతరంగా జరగాలన్నారు. ఎలక్ట్రో మెకానికల్ సమస్యలు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల ఆవాసాలకు జరిగే తాగునీటి సరాఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.
టైగర్ రిజర్వ్, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తాగునీటిని అందించాలన్నారు. స్కూల్స్, అంగన్ వాడీలను తనిఖీ చేసి నీటి సరాఫరా తీరును పరిశీలించాలని ఈ.ఎన్.సి సూచించారు. ఇక మిషన్ భగీరథతో ఉచితంగా అందుతున్న తాగునీటిని వృథా చేయకుండా ఉపయోగించేలా ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలను కొనసాగించాలని చెప్పారు.
గ్రామాల్లో కొత్తగా ఏర్పాటవుతున్న డబుల్ బెడ్ రూం కాలనీలకు నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు సంబంధిత శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడాలన్నారు. అటవీ ప్రాంతాల్లో గిరిజనుల కొత్తగా ఏర్పాటు చేసుకునే ఆవాసాలకు కూడా సాధ్యమైనంత త్వరగా నీటి సరాఫరా చేయాలని కృపాకర్ రెడ్డి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్ , చీఫ్ ఇంజనీర్లు విజయ్ ప్రకాశ్, వినోభాదేవి, చిన్నారెడ్డి, చక్రవర్తి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.