రూ.3.73 లక్షల కోట్లకు పెరిగిన అదానీ నికర విలువ
మస్క్, బెజోస్ కంటే వేగంగా పెరిగిన ఆయన సంపద
కొత్త బిలియనీర్‌గా నైకా సిఇఒ
2022 హురున్ గ్లోబల్ రిచ్ జాబితా వెల్లడి
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ సంపద గత ఏడాది కాలంలో భారీగా పెరిగింది. దేశీయంగా, ఆసియాలో అత్యంత సంపన్నుడు అయిన గౌతమ్ అదానీ సంపద గతేడాది 49 బిలియన్ డాలర్లు (రూ.3,73,266 కోట్లు)పెరిగింది. ప్రపంచ బిలియనీర్లు ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటివారితో పోలిస్తే అత్యధికంగా నికర విలువ పెరిగింది. గౌతమ్ అదానీ సంపద ఏడాదిలో 49 బిలియన్ డాలర్లు పెరిగింది. బుధవారం విడుదల చేసిన 2022 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం, అదానీ గ్రూప్ చైర్మన్ గత ఏడాదిలో వారానికి దాదాపు రూ.6,000 కోట్లు ఆర్జించారు. చమురు నుంచి రిటైల్ వరకు బహుళ వ్యాపారాలు కల్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నికర విలువ 103 బిలియన్ డాలర్లతో వార్షికంగా 24 శాతం సంపద పెరుగుదలను మాత్రమే నమోదు చేసింది.
పోర్టుల నుంచి ఎనర్జీ వరకు వివిధ వ్యాపారాలు కల్గిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ నికర విలువ వార్షికంగా 153 శాతం పెరిగింది. మొత్తం విలువ 81 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక గత పదేళ్లలో అంబానీ సంపద 400 శాతమే పెరగ్గా, అదానీ నికర విలువ మాత్రం 1,830 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక హెచ్‌సిఎల్ శివ్‌నాడార్ 28 బిలియన్ డాలర్ల పెరుగుదలను చూడగా, ఆ తర్వాతి స్థానాల్లో సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత పూనావాలా (26 బిలియన్ డాలర్లు), స్టీలు దిగ్గజం ఎన్.మిట్టల్ (25 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
ఎం3ఎం హురున్ జాబితా 2022లో గౌతమ్ అదానీ(59) అతిపెద్ద గెయినర్‌గా నిలువగా, గతేడాది ఆయన సంపద 49 బిలియన్ డాలర్లు పెరిగింది. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ నికర విలువ 7.6 బిలియన్ డాలర్లతో హురూన్ జాబితాలో చేరారు. ఎం3ఎం హురూన్ జాబితా ప్రకారం, 2022 దాదాపు 69 దేశాలు, 2,557 కంపెనీల నుంచి 3,381 బిలియనీర్ల జాబితాను రూపొందించారు. నివేదిక ప్రకారం, 215 మంది బిలియనీర్లు, 58 మంది కొత్త పారిశ్రామికవేత్తలతో భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద బిలియనీర్ మేకర్‌గా అవతరించింది.