Thursday, November 14, 2024

కివీస్‌కు సౌతాఫ్రికా షాక్

- Advertisement -
- Advertisement -

హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా టీమ్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా రెండు వికెట్ల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇక ఈ ప్రపంచకప్‌లో సఫారీ టీమ్‌కు ఇది నాలుగో గెలుపు కాగా కివీస్‌కు మూడో ఓటమి కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా సౌతాఫ్రికా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు లిజెలె లీ, లౌరా వల్‌వార్డ్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. అయితే రెండు ఫోర్లతో 17 పరుగులు చేసిన లీ లేని పరుగు కోసం వెళ్లి రనౌటైంది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన తజ్మీన్ బ్రిస్ట్‌తో కలిసి లౌరా పోరాటం కొనసాగించింది. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన బ్రిస్ట్ మూడు ఫోర్లతో 18 పరుగులు చేసి వెనుదిరిగింది. తర్వాత వచ్చిన కెప్టెన్ సునె లూస్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టుకు అండగా నిలిచింది. ఇటు లౌరా అటు సునె తమ మార్క్ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కుదురుగా ఆడడంతో సౌతాఫ్రికా పటిష్టస్థితికి చేరింది. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన లౌరా 6 ఫోర్లతో 67 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన సునె లూస్ 4 బౌండరీలతో 51 పరుగులు సాధించింది. ఇక మరిజానె కాప్ ఆల్‌రౌండ్‌షోతో అలరించింది. కీలక సమయంలో సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోయినా చివరి వరకు క్రీజులో నిలిచిన కాప్ జట్టును గెలిపించింది. ధాటిగా ఆడిన కాప్ 4 ఫోర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.
డివైన్ ఒంటరి పోరాటం..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను కెప్టెన్ సోఫి డివైన్ ఆదుకుంది. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన డివైన్ 101 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 పరుగులు చేసింది. ఆమెకు అమెలియా కెర్ (42) తనవంతు పాత్ర పోషించింది. మిగతావారిలో మాడి గ్రీన్ (30), హల్లిడే (24) మాత్రమే కాస్త రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లు సమష్టి ప్రతిభతో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. షబ్నమ్ ఇస్మాయిల్, ఖాకా మూడేసి వికెట్లు పడగొట్టగా కాప్ రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News