భారత్ ముందు ప్రపంచ సవాలు
అమెరికాను కాదనలేదు
అవకాశం వదలుకోలేదు
న్యూఢిల్లీ : రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారతదేశం అంతర్జాతీయంగా దౌత్యస్థాయిలో పాటించాల్సిన వ్యూహం అత్యంత కీలకం అయింది. రష్యా ఇటీవలి కాలంలో భారత్‌కు చౌక ధరలకు ముడిచమురు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే మరో వైపు అమెరికా రష్యా నుంచి చమురు ఇతరత్రా దిగుమతులపై తమ దేశం ఆంక్షలు విధిస్తోందని, ఇతర దేశాలు కూడా దీనిని పాటించాల్సి ఉందని కోరింది. ఈ దశలో రష్యా నుంచి భారతదేశం ఇంధన లావాదేవీలు సాగించడం వివాదాస్పదం అయింది. అయితే తమ దేశానికి ఇంధన లావాదేవీల వ్యవహారాల అమలు విషయంలో చట్టబద్ధత ఉందని, దీనిని తమ దేశం స్వీయ ప్రయోజనాల కోణంలోపాటిస్తుందని భారత ప్రభుత్వం తెలిపింది. రష్యా నుంచి చమురు దిగుమతుల వ్యవహారాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ఇది ఆంక్షల వ్యాపారాల పరిధిలోకి వచ్చే అంశం కాబోదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఓ వైపు అమెరికా కూడా రష్యా చమురును భారతదేశం తీసుకోవడంలో తప్పేమీ లేదని పేర్కొంటూనే ఇప్పటి సంక్షోభ దశలో దేశాల వైఖరి అనుగుణంగానే ఆయా దేశాలు ఏ పక్షం వైపు ఉన్నాయనేది నిర్థారించుకోవడానికి వీలుంటుందని పరోక్షంగా భారత్‌కు హెచ్చరికలు వెలువరించింది. అతి తక్కువ ధరలకు అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరలతో బేరీజు వేసుకుంటే చౌక ధరలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి)కు రష్యా 30 లక్షల బ్యారెల్స్ ముడిచమురు అందించేందుకు ప్రతిపాదించింది. ఇంధన అవసరాల నేపథ్యంలో భారతదేశానికి ఇది అత్యంత అరుదైన కలిసి వచ్చే అవకాశం . దీనిని ఏ విధంగా కూడా కాదనడం భారత్‌కు కుదరదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే రష్యాపై అమెరికా ఆంక్షల కోణంలో ఈ ఆఫర్‌ను చూడరాదని, దీనిని తమ దేశ వ్యాపార ప్రత్యేకించి ఇంధన వ్యవహారాల కోణంలోనే చూడాల్సి ఉంటుందని భారతదేశం పేర్కొంది.
ఇండియా అవసరాలలో ఇప్పటివరకూ రష్యానుంచి కేవలం 1 శాతం మేరనే క్రూడాయిల్ అందుతోంది. పది ఇతర దేశాల నుంచి ప్రధానంగా ఇండియా చమురు అవసరాలను తీర్చుకొంటోంది. ఈ జాబితాలో రష్యా లేదు. అయితే ఉక్రెయిన్‌లో పరిస్థితి నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో తలెత్తే సవాళ్లను ఎందుర్కొనేందుకు , తలెత్తే ఒత్తిడిని తట్టుకునేందుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలను వినియోగించుకోవడం భారతదేశానికి తప్పదు. ఈ దిశలోనే ఇండియా ఇప్పుడు రష్యా ఆఫర్‌ను కాదనలేదు. ఈ దిశలో అమెరికాను భారత్ కాదంటున్నట్లుగా నిర్థారించుకోరాదని భారత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అత్యంత సున్నితమైన రీతిలో ఉన్న దౌత్య వ్యవహారాలను గమనిస్తూ రష్యా నుంచి సాయం విషయంలో భారతదేశం జాగ్రత్తగా పావులు కదుపుతోంది.
ఇండియాకు చమురు సరఫరా దేశాల జాబితా
భారతదేశంలో రోజురోజుకీ విస్తరిస్తోన్న ఇంధన అవసరాలను ప్రత్యేకించి పశ్చిమాసియా దేశాలు తీరుస్తున్నాయి. వీటిలో ఇరాక్ నుంచి 23 శాతం, సౌదీ అరేబియా నుంచి 18 శాతం, యుఎఇ నుంచి 11 శాతం చమురు దిగుమతి అవుతోంది.ఈ దివలో భారత్‌కు అందుతోన్న అమెరికా కోటా ఇప్పటివరకూ 7.3 శాతంగా ఉంది. ఇప్పుడు రష్యా నుంచి భారీ స్థాయిలోనే ముడిచమురును అత్యల్ప ధరలకు తీసుకునేందుకు అవగాహన కుదుర్చుకోవడం ద్వారా భారతదేశం ఓ వైపు తన ఇంధన భవిష్యత్తును కాపాడుకుంటూనే మరో వైపు దౌత్య నీతిలో సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తోంది.