ప్రధానికి, సోనియాకు ఆహ్వానాలు
లక్నో : ఈ నెల 25న ఉత్తరప్రదేశ్ సిఎంగా యోగి ఆదిత్యానాథ్ ప్రమాణస్వీకార ఘట్టం అట్టహాసం అవుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాన ఆహ్వానితులు అయ్యారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక , ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్ యాదవ్, మాయావతి వంటి ప్రతిపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు పంపించారు. 30 సంవత్సరాలలో వరుసగా రెండోసారి యుపి సిఎం అవుతున్న ఘనత దక్కించుకున్న యోగి ఈ స్థాయిలోనే తన రెండో దఫా అధికార స్వీకరణ ఘట్టాన్ని ఎంచుకున్నారు. మొత్తం 200 మంది విఐపిలు జాబితాలో చోటుచేసుకున్నారు.
బిజెపి పాలిత రాష్ట్రాల సిఎంలు కూడా కార్యక్రమానికి వస్తారు. యోగి ప్రమాణస్వీకారానికి పలువురు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు వస్తారని భావిస్తున్నారు. సంస్థ అధినేత మోహన భగవత్ వంటి వారు విచ్చేస్తారని వెల్లడైంది. ఇక కార్యక్రమంలో ప్రజల వైపు నుంచి ప్రాతినిధ్యం ఉండేలా కూడా చూసుకుంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధిదారులైన కొందరిని ప్రత్యేకించి మహిళలను ఎంచుకుని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడైంది. లక్నోలోని ఏకానా స్టేడియం అధికార స్వీకరణోత్సవానికి వేదికగాముస్తాబు అవుతోంది.