మార్పు మందగమన. తన కదలికను సైతం గుర్తు పట్టలేనంత నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. పైకి వచ్చి కనబడితే గాని కనిపెట్టలేని జలాంతర్గామి వంటిది. దేశ రాజకీయాల్లో అటువంటి మార్పేదో ఎప్పటికైనా రానున్నదనిపించేలా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నడక సాగుతున్నది. దేశ రాజధాని రాజకీయాలకే పరిమితమైపోయిందనిపిస్తూ వచ్చిన ఈ పార్టీ పంజాబ్‌లో బంపర్ మెజారిటీతో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోడం అద్భుతమనిపించింది. 117శాసన సభ స్థానాల్లో 92 గెలుచుకొని ఉత్తరప్రదేశ్‌లో బిజెపి సాధించిన విజయానికి ఎంత మాత్రం తీసిపోలేదని చాటుకున్నది. అయితే ఢిల్లీని పరిపాలించడానికి, పంజాబ్ పాలనకు సారథ్యం వహించడానికి తేడా వుందనే అభిప్రాయం వినవస్తున్నది. పంజాబ్‌లోని పట్టణ, గ్రామీణ ప్రజలు కలిసి అత్యధిక మెజారిటీతో తనను ఎన్నుకోడంలోని ఆంతర్యాన్ని గమనించి సమర్థవంతమైన, విప్లవాత్మకమైన పాలనను ఆప్ అందించగలిగితే అది తప్పనిసరిగా మిగతా దేశం మీద ప్రభావం చూపుతుంది. వరుసగా మరి కొన్ని రాష్ట్రాల ప్రజలు ఆప్ తరహా పాలనను కోరుకునే అవకాశం కలుగుతుంది. అది అంతిమంగా దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకి దారి తీస్తుంది. ఎన్నికల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం మీద ఆధారపడే పరిస్థితి పోయి ప్రజలకు నిజమైన మేలు చేయడం అనే దాని వైపు పార్టీలు దృష్టి కేంద్రీకరించి అందులో అవి పోటీ పడేలా చేస్తుంది. అందుచేత పంజాబ్‌లో ఆదర్శవంతమైన పాలనను అందించవలసిన బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన వుంది. అకాలీదళ్, కాంగ్రెస్‌లు అందించిన అవినీతి, అసమర్థ పాలనతో విసిగెత్తిపోయిన పంజాబ్ ప్రజలు ఆప్‌ను అసాధారణ ఆధిక్యతతో అధికారంలోకి తీసుకు వచ్చారు. 2013లో కాంగ్రెస్ మద్దతుతో మొదటిసారి ఢిల్లీని పాలించిన 49 రోజులలోనే తాను అక్కడ అవినీతిని తుదముట్టించానని, పంజాబ్‌లో కూడా అది సాధ్యమేనని కేజ్రీవాల్ అన్నారు. ఎవరైనా లంచం అడిగితే నేరుగా తనకు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక వాట్సప్ నెంబర్‌ను ప్రజలకు ఇవ్వడమనేది ఢిల్లీలో సత్ఫలితాలిచ్చిందని, 3032 మంది అవినీతి అధికారులను జైలుకు పంపించామని ఆయన చెప్పుకున్నారు. అదే పద్ధతిని ఇప్పుడు పంజాబ్‌లోనూ ఆప్ అమలు చేస్తున్నది. అయితే ఎంత వరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. 2019లో జరిపిన ఇండియా కరప్షన్ సర్వే ప్రకారం అవినీతిలో దేశంలోకెల్లా రాజస్థాన్ అగ్రభాగాన వుంది. అతి తక్కువ అవినీతి రాష్ట్రాలుగా ఢిల్లీ, ఒడిశాలు జాబితా చివరిలో వున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్, పోలీసు, మునిసిపల్ శాఖల్లో అవినీతి తాండవిస్తున్నదని ఈ సర్వే చెప్పింది. 2019లో పంజాబ్ ప్రజల్లో 63 శాతం మంది లంచం చెల్లించినట్టు తేలింది. అందుచేత పంజాబ్‌లో అవినీతిని పారద్రోలడం ఢిల్లీలో సాధించినంత తేలిక కాకపోవచ్చు. ఆచరణే అన్నింటికీ గీటురాయి. పంజాబ్ ప్రజలకు ఆప్ ఇచ్చిన వాగ్దానాలలో రెండు అతి ముఖ్యమైనవి, అత్యంత ఆర్థిక భారంతో కూడుకున్నవి. ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా సరఫరా చేస్తామన్నది ఇందులో ఒకటైతే, ప్రతి మహిళకూ నెలనెలా రూ. 1000 ఇస్తామన్నది రెండోది. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఈ నెల 13న జరిగిన ఆప్ విజయోత్సవ యాత్రలో అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే ఉచిత విద్యుత్తు, ప్రతి మహిళకు వెయ్యి రూపాయల భృతి వాగ్దానాలు రెండూ ఆర్థికంగా అసాధారణ భారాన్ని ప్రభుత్వం మీద మోపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల మీద అదనంగా పన్నులు విధించబోమని ఆప్ వాగ్దానం చేసింది. ఈ రెండు వాగ్దానాల కింద ప్రభుత్వం ఏటా అదనంగా రూ. 20,600 కోట్లు భరించాల్సి వుంటుందని చెబుతున్నారు. అదనంగా పన్నులు వేయకుండా ఇంత మొత్తం ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటారు అనేది ముఖ్యమైన ప్రశ్న. పంజాబ్ రాష్ట్రం మీద ఇప్పటికే రూ.2.82 లక్షల కోట్ల రుణ భారముంది. 2021-22లో ప్రజలకిచ్చిన ఉచిత విద్యుత్తు కింద రూ.10,668 కోట్లు సబ్సిడీగా ప్రభుత్వం భరించింది. 300 యూనిట్ల ఉచిత కరెంటు వాగ్దానం అమలైతే ఈ మొత్తానికి మరి రూ. 5000 కోట్లు వచ్చి చేరుతుంది. అలాగే 18 ఏళ్లు, ఆ పై వయసు గల ప్రతి మహిళకు రూ. వెయ్యి రూపాయలు ఇవ్వదలచిన వాగ్దానం కింద రూ.15,600 కోట్లు భరించవలసి వస్తుంది. ఇటువంటి ఆర్థిక భారాలను తట్టుకోడానికి ఆ రాష్ట్రంలోని ధనిక వ్యాపారుల మీద పన్ను విధింపు, విద్యుత్ సరఫరాలో నష్టాలను పూడ్చడం వంటి చర్యలు తీసుకోవలసి వస్తుంది. దశాబ్దాలుగా చెప్పనలవికాని అవినీతికి అలవాటుపడిపోయిన ప్రభుత్వ యంత్రాంగాన్ని క్షాళన చేయడం సాధారణమైన విషయం కాదు. మరింత నిజాయితీతో కూడిన కృషి తోడైతే ఢిల్లీలో దృఢ సంకల్పంతో కేజ్రీవాల్ సాధించిన విజయాలు పంజాబ్‌లో కూడా సాధ్యమే.
AAP Won 92 Assembly Seats in Punjab