Saturday, November 23, 2024

25న ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం

- Advertisement -
- Advertisement -

no-confidence motion against Imran Khan on 25th

వెలువడ్డ నోటీసు .. బలపరీక్ష ఈ వారమే?

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి దేశ పార్లమెంట్‌లో వచ్చే వారం కీలక పరీక్ష ఎదురవుతుంది. ఈ నెల 25వ తేదీన దేశ జాతీయ అసెంబ్లీ సమావేశం ఏర్పాటుకు సభ స్పీకర్ అసద్ ఖైసర్ ఆదివారం ఆదేశాలు వెలువరించారు. ద్రవ్యోల్బణం, ధరల పరిస్థితి ఇతర అంశాలను ప్రస్తావిస్తూ ఇమ్రాన్‌ఖాన్‌పై దేశ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, తరువాత బల నిరూపణకు ఓటింగ్‌కు పార్లమెంట్ ఈ నెల 25వ తేదీన భేటీ అవుతుండటంతో రాజకీయ వర్గాల్లో దీనిపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఈ నెల 8వ తేదీననే పాకిస్థాన్‌కు చెందిన పిఎంఎల్‌ఎన్, పిపిపి ఎంపిలు దాదాపు వంద మంది సంతకాలతో అవిశ్వాస తీర్మానానికి నోటీసు వెలువరించారు. సోమవారమే పార్లమెంట్ భేటీ జరగాల్సి ఉందని, నిబంధనలను పాటించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.

అయితే ఆదివారం స్పీకర్ కార్యాలయం నుంచి వెలువడిన అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 25వ తేదీన జాతీయ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. వచ్చే శుక్రవారం ఉదయం 11 గంటలకు భేటీ జరుగుతుంది. అవిశ్వాసంపై చర్చ తరువాత బలపరీక్షకు మూడు నుంచి ఏడు రోజుల వ్యవధి ఉంటుంది. 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ప్రతిపక్షాలకు 172 మంది ఎంపిల మద్దతు అవసరం ఉంటుంది. మిత్రపక్షాల అస్పష్ట వైఖరి, స్వపక్షంలో కొందరు ఎంపిలు ఇటీవలే ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం , అన్నింటికి మించి దేశంలోని అత్యంత శక్తివంతం, రాజకీయాధికారాన్ని ఖరారు చేసే సైన్యం ఇప్పటివరకూ తటస్థ వైఖరితోనే ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ పిటిఐ పార్టీ అధికారం భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News