Monday, December 23, 2024

బహుజన బాటలో కథకుల కచ్చీరు

- Advertisement -
- Advertisement -

ఆధిపత్య కులాల కథకులు తమ జీవితాలను, సంస్కృతిని ప్రతిఫలింప జేస్తూ రాసిన కథలే 1990ల వరకు మొత్తం తెలుగు జాతి ప్రాతినిధ్య కథలుగా, ఉత్తమ కథలుగా విమర్శకులు, అవార్డుల నిర్ణేతలు, కొంతమంది ‘పండితులు’ ప్రచారంలో పెట్టారు. దీని ద్వారా తెలుగు కథా సాహిత్యమంటే ఆధిపత్య కులాల వాండ్లు రాసిందే అనే విధంగా ఒక అభిప్రాయం ప్రోది అయింది. వీళ్లు చిత్రించిన మధ్యతరగతి జీవితాలు, వారి సామాజిక సమస్యలే గొప్ప వస్తువులుగా చలామణి అయ్యాయి. ఇట్లా చలామణిలో పెట్టింది కూడా కథకుల సామాజిక వర్గానికి చెందినవారు, వారికి అనుకూలంగా ఉండే పత్రికలు, సంపాదకులు అనేది గమనంలోకి తీసుకోవాలి. ఇవే కథలు ఇంగ్లీషులోకి తర్జుమా అయ్యాయి. అయితే ఇప్పుడు చరిత్రను తిరగరాయాల్సిస సమయం ఆసన్నమయింది. 1990లో ఒక వైపు మండల్ ఉద్యమ స్ఫూర్తి మరోవైపు అంబేడ్కర్ శతజయంతి ఉత్సవాలు కొత్త చరిత్రకు పాదులు వేశాయి. ప్రపంచీకరణ కూడా కొత్త ద్వారాలు తెరిచాయి. అస్తిత్వ సోయిని పెంపొందించింది. ఔటాఫ్ ది బాక్స్ ఆలోచనలకు దారులు వేశాయి. మూలాలు తరచి చూసుకునే ఇంగితాన్ని కలిగించాయి.
ఈ చైతన్యంతో బహుజనులు తాము 1990లకు ముందు ఆ తర్వాత రాసిన కథల్లోని విశిష్టతలను విశ్లేషించడం ప్రారంభించారు. తమ జీవితాలూ చరిత్రకెక్కదగ్గవే అన్న సోయిని తెచ్చుకున్నారు. దీంతో అందుబాటులో లేని కథలను సంపుటాలుగా, సంకలనాలుగా వెలువరించారు. ఎప్పుడో 194050వ దశకంలో కథలు రాసిన అందే నారాయణస్వామి, జి.రాములు, గూడూరి సీతారావ్‌ు, ఆవుల పిచ్చయ్య, తాడి నాగమ్మ లాంటి కథకుల సంపుటాలు వెలువడ్డాయి. ఇటీవల తెలంగాణ దళిత కథలు, రాయలసీమ దళిత కథలు పుస్తకాలుగా వెలుగుచూశాయి. అంతేకాదు ‘అడపం’ పేరిట మంగలి వారి కథలు, ‘పడుగు పేకలు’ పేరిట చేనేత సామాజిక జీవితాల కథలు, ‘వేపకాయంత నిజం’ పేరిట గొల్ల, కురుమల జీవితాలు కథా సంకలనాలుగా వెలువడ్డాయి. ‘వతన్’, ‘కథామినార్’, ‘చోంగారోటి’, ‘మొహర్’ కథా సంకలనాలు ముస్లింల జీవితాలను చిత్రికగట్టాయి. జయధీర్ తిరుమలరావు, జీవన్‌లు ‘ఇప్పపూలు’ పేరిట గిరిజన, సంచార తెగల కథలను ఒక్కదగ్గరికి తీసుకొచ్చారు. యువ కథకులు రమేశ్ కార్తిక్ ‘ఢావ్లో’ పేరిట బంజారాల జీవితాలను కథలుగా మలిచిండు. తెలుగు సమాజంలోని 90శాతం ప్రజలకు సంబంధించిన జీవితాలు ఇట్లా కథా సాహిత్యంలో రికార్డవుతున్నా మెయిన్‌స్ట్రీవ్‌ు (నిజానికి మెయిన్‌స్ట్రీవ్‌ు అనేది ఒక మిథ్) మీడియా పట్టించుకోవడం లేదు. లేదా సెలెక్టెవ్‌గా తమకు అనుకూలంగా ఉన్నవారిని పట్టించుకొని మిగతా వారిని ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్నది. ఇదంతా పైకెక్కడా బహిర్గతం కాదు. కానీ వివక్ష, విస్మరణ కొనసాగుతూ ఉన్నది. ఎందుకంటే తీర్పరులు ఆధిపత్య కులం వారు కావడమే అందుకు కారణం. వీటిని అధిగమించడంలో భాగంగా న్యాయంగా కేవలం సాహిత్యం (కథలు) మాత్రమే వాటి మంచి చెడుల నిర్ధారణకు గీటురాయిగా ఉండాలని భావించి రెండ్రోజుల బహుజన కథా కచ్చీరు ససమావేశం నిర్వహించడమైంది.
ఈ మార్చి 12, 13 తేదీల్లో నాగార్జునసాగర్‌లోని ‘బుద్ధవనం’లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమల నుంచి నలభైకి పైగా కథకులు, విమర్శకులు పాల్గొన్నారు. వివిధ సాహిత్యాంశాలపై లోతైన చర్చ, విమర్శ, విశ్లేషణ జరిగింది. మొదటి రోజు మొదటి సమావేశంలో సుప్రసిద్ధ నవలాకారులు, కథకులు పెద్దింటి అశోక్‌కుమార్ ‘తెలుగు కథ రూపంసారం’ అనే అంశంపై విలువైన ప్రసంగం చేశారు. రూపము, సారము కథా సాహిత్యంలో ఎట్లా పరిపక్వత సాధిస్తుంది, దానికి కథకులు తీసుకోవాల్సిస జాగ్రత్తలు, శిల్ప రీత్యా తీర్చిదిద్దాల్సిస మెరుగులు, రసానుభూతి తదితర విషయాలపై సమావేశంలో పాల్గొన్న యువ కథకులకు మార్గనిర్దేశనం చేసే విధంగా మాట్లాడారు. పెద్దింటి ప్రసంగం వింటూ ఉంటే ఆయన ఎంత విసృ్తతంగా ఇంగ్లీషు, తెలుగు కథా సాహిత్యం చదువుతారో అర్థమయింది. ఎందుకంటే ఆ కథ రచయితల కథలను పోలుస్తూ విషయ విశ్లేషణ చేసిండు. ‘సారం అంటే నీతి కాదు’ అని చెప్పిండు. వైద్యం ఆర్‌ఎంపీ, ఎంబిబిఎస్, ఎండి, స్పెషలిస్టు డాక్టర్లు అందరూ అందిస్తారు. అయితే స్పెషలిస్టు డాక్టరే మెరుగైన వైద్యం అందించగలడని కథకులు కూడా అట్లా స్పెషలిస్టులుగా ఎదగాలని, మంచి కథలు రాయాలని చెప్పిండు. అద్దేపల్లి ప్రభు అతడు మనిషి, మధురాంతకం మహేంద్ర అతడిపేరు మనిషి, తిలక్ నల్లజర్ల రోడ్డు, పెద్దింటి అశోక్ కుమార్ విత్తనం కథలు ఒకే విషయాన్ని చెప్పినా రూపంలో తేడా ఉన్నాయని పోల్చి చెప్పిండు. ఈ సెషన్‌కు కేంద్ర సాహిత్య యువపురస్కార గ్రహీత పసునూరి రవీందర్ అధ్యక్షత వహించారు.
తర్వాత జరిగిన రెండో సెషన్‌లో విమర్శకులు, తెలంగాణ కథా వార్షిక సంపాదకులు సంగిెట్టి శ్రీనివాస్ (ఈ వ్యాస రచయిత) ‘తెలంగాణ రాష్ట్రానంతర కథ’పై మాట్లాడుతూ ‘బహుజన కథ’, ‘వస్తువు’, ‘భాష’ ఎట్లా ఎందుకు విస్మరణకు గురవుతుందో చెప్పిండు. ఈ విస్మరణ నుంచి బయటపడాలంటే బహుజనులు విసృ్తతంగా రాయడమే గాకుండా బహుజన సోయితో రాయలన్నారు. తెలంగాణ కథా వార్షిక నిర్వహణలో వచ్చే సమస్యలు, వాటిని అధిగమిస్తున్న తీరుని కూడా కథకులతో పంచుకున్నాడు. తెలంగాణ తనాన్ని ప్రతిఫలింపజేస్తూ భిన్నమైన వస్తువుతో రాసే కథలకు తమ సంకలనాల్లో ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. యువ కథకులు తమ వీర యోధుల గురించి కథలల్లినట్లయితే వారి గురించి ప్రజలకు తెలిసే అవకాశముంటుంది. తద్వారా వారికి సమాజంలో గౌరవం, గుర్తింపు దక్కుతుంది అన్నారు. బహుజన రాజ్యాధికార సాధన కథలు, అంబేడ్కర్ భావజాల వ్యాప్తి కథలు ఎక్కువగా వచ్చినట్లయితే సబాల్టర్న్ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ సెషన్‌కు కవి, కథా రచయిత గుడిపల్లి నిరంజన్ అధ్యక్షత వహించారు. లంచ్ తర్వాత జరిగిన మరో సెషన్‌లో సీనియర్ విమర్శకులు అంబటి సురేంద్రరాజు దేశ, విదేశాల మెరుగైన కథల గురించి చెబుతూ అవి ఎందుకు గొప్ప కథలయినాయో విడమర్చి చెప్పిండు. చమన్ సంపాదకులు స్కైబాబ ఈ సెషన్‌ని నిర్వహించారు.
కథకులు చందు తులసి అధ్యక్షతన జరిగిన మరో సెషన్‌లో పదునైన విమర్శకులు జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ క్రైవ్‌ు, థ్రిల్లర్‌ని బహుజన స్పృహతో కథా సాహిత్యంలోకి తీసుకు రావడానికి కథకులు కృషి చేయాలన్నారు. ‘మ్యాజిక్ రియలిజవ్‌ు’ లాంటి శిల్పాన్ని ఎంచుకొని ఇట్లాంటి కథలు రాసినట్లయితే అవి పాఠకులకు నచ్చుతాయన్నారు.
13వ తేదిన మరో యువపురస్కార గ్రహీత (కేంద్ర సాహిత్య) మెర్సిమార్గరెట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కవి, కథకులు జి.వెంకటకృష్ణ మాట్లాడుతూ 1990ల తర్వాత అర్బనైజేషన్, గ్లోబలైజేషన్ మూలంగా తెలుగు కథలో మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. బహుజనుల కథలు ఎక్కువగా పుస్తకాలుగా వచ్చినట్లయితే వాటి మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది. అట్లాగే బహుజన విమర్శకులు ఎదిగి రావాలని చెప్పారు. బహుజనులు తమకు జరుగుతున్న అన్యాయాలపై, అమలవుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు కథలు సెన్సిటైజ్ చేస్తాయని వెంకటకృష్ణ అభిప్రాయ పడ్డారు. కథ సంవిధానం, కథ చెప్పే ‘టోన్’పై శ్రద్ధ వహించాలన్నారు. వెంకటకృష్ణ తన ప్రసంగంలో మ్యాజిక్ రియలిజవ్‌ు శిల్పంతో అద్భుతమైన కథలు రాసిన వి.చంద్రశేఖరరావుని విమర్శకులు విస్మరించారన్నారు. అట్లాగే యువ కథకులు మన్నె ఏలియా కథా సంపుటిలోని మూడు కథలను ప్రత్యేకంగా ప్రస్తావించి వాటిలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూనే, మెరుగైన కథలను ప్రశంసించారు. తద్వారా లోపమెక్కడుందో, బలమెక్కడుందో తెలుసుకోవడానికి కొత్త కథకులకు మెళకువలు నేర్పినట్టయ్యింది.
ముగింపు సమావేశంలో సదస్సు నిర్వాహకుల్లో ఒకరైన పసునూరి రవీందర్ మాట్లాడుతూ బహుజన భావజాల వ్యాప్తికి అందరూ సమిష్టిగా కృషి చేయాల్సిన సందర్భమని పేర్కొన్నారు. కథకులు తమ అభిప్రాయాలను,ఆలోచనలను వేదిక ద్వారా పంచుకున్నారు.
ప్రతి సంవత్సరం రెండుసార్లు బహుజన కథా కచ్చీరుని కొంతమంది మిత్రులం కలిసి నిర్వహిస్తున్నాము. కోవిడ్ కారణంగా గత సంవత్సరం నిర్వహించలేక పోయాము. ఈసారి ముందుగానే ప్లాన్ చేసి ఒక చారిత్రక ప్రదేశంలో నిర్వహించాలని నిర్ణయించి ‘బుద్ధవనం’లో ఈ సమావేశాన్ని నిర్వహించాము. ఈ సదస్సులో పైన పేర్కొన్న వారితో పాటుగా తెలుగు సాహిత్యంలో ముస్లిం గొంతుకను బలంగా వినిపించే అన్వర్, షాజహానా, సీనియర్ కథకులు బారహమతుల్లా, ఇనాయతుల్లా, హనీఫ్, భూతం ముత్యాలు, మన్నె ఏలియా, గాదె వెంకటేశ్, చందు తులసి, శ్రీనివాస్ గౌడ్, యువకులు గుడిపల్లి నిరంజన్, రాజు దుర్గాని, రమేశ్ కార్తిక్, మహమూద్ షేక్ పీర్ల, కె.వి.మన్‌ప్రీతవ్‌ు, తాళ్లపల్లి యాకమ్మ, శీలం భద్రయ్య, పెరుమాండ్ల రావ్‌ు, మండల స్వామి, కొంగరి జానయ్య, సాగర్ల సత్తయ్య, సినిమా పాటల, కథల రచయిత అక్కల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇందులో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి నలభైకి పైగా కథకులు, విమర్శకులు పాల్గొన్నారు. తమ అభిప్రాయాలను వేదికపై పంచుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో సినీగేయ రచయిత కందికొండ యాదగిరి మరణ వార్త తెలియడంతో ఆయనకు ఘన నివాళి అర్పించడమైంది. ఇట్లాంటి సదస్సులు మరింత ఎక్కువగా జరిగినట్లయితే కొత్త కథకులు బలమైన కథలు రాయడానికి, వాటిని విశ్లేషించగలిగే బహుజన విమర్శకులు తయారు కావడానికి వీలవుతుంది. సబాల్టర్న్ సాహిత్యం పాదులూనుకోవడానికి ఊతమిస్తాయి.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News