న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా రెండో రోజూ 2 వేల దిగువనే కొత్త కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 3.84 లక్షల వైరస్ పరీక్షలు చేయగా, 1549 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాజిటివిటీ రేటు 0.40 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో 2652 మంది వైరస్ నుంచి కోలుకోగా, రికవరీ రేటు 98.74 శాతానికి చేరింది. ఇక 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 31 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. కొత్త కేసులు తగ్గడంతో క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ప్రస్తుతం దేశంలో 25,106 మంది వైరస్‌తో బాధపడుతుండగా క్రియాశీల రేటు 0.06 శాతానికి దిగొచ్చింది.
181 కోట్లు దాటిన టీకా పంపిణీ
మరోవైపు దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతోంది. ఆదివారం మరో 2.97 లక్షల మందికి టీకా అందించారు. ఇప్పటివరకు 181.24 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మార్చి 16 నుంచి 1214 ఏళ్ల వారికి కూడా టీకాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ వయసు వారిలో 17.90 లక్షల మంది తొలిడోసు వ్యాక్సిన్ తీసుకున్నారు.