కమిటీ నివేదిక బహిర్గతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో పార్లమెంట్‌లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వీటి రద్దుపై అభ్యంతరం తెలిపింది. ఈ మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో ప్రయోజనకరమని, వీటిని రద్దు చేయడం కన్నా కొనసాగించడమే మంచిదని ఆ కమిటీ సిఫార్సు చేసింది. గత ఏడాది మార్చి 19న సుప్రీంకోర్టుకు సమర్పించిన కమిటీ నివేదిక సోమవారం బహిర్గతమైంది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ వ్యవసాయ చట్టాలలో అనేక మార్పులను కూడా సూచించింది. పంటలకు కనీస మద్దతు ధరను(ఎంఎస్‌పి) చట్టబద్ధం చేసే స్వేచ్ఛను రాష్ట్రాలకే వదిలిపెట్టాలని కూడా కమిటీ సూచించింది. కమిటీ సభ్యులలో ఒకరైన అనీల్ ఘన్వట్ సోమవారం ఇక్కడ తమ కమిటీ నివేదికలోని సిఫార్సులను విలేకరులకు తెలియచేశారు.
2021 మార్చి 19న కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించామని, నివేదికను విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు మూడు సార్లు లేఖలు రాసినా ఎటువంటి స్పందన లేదని స్వతంత్ర భారత్ పార్టీ అధ్యక్షుడైన ఘన్వట్ తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు అయినందున ఇప్పుడు అవి చెల్లుబాటులో లేవని, అందుకే తాను నివేదికను బయటపెడుతున్నానని ఆయన చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగం కోసం విధానాలను రూపొందించడంలో కమిటీ నివేదిక ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం లేదా వాటిని దీర్ఘకాలం సస్పెన్షన్‌లో ఉంచడం వల్ల వాటిని బలపరుస్తున్న వారికి అన్యాయం చేసినట్లేనని ఘన్వట్ అభిప్రాయపడ్డారు. ఈ కమిటీలో వ్యవసాయ ఆర్థిక నిపుణులు అశోక్ గులాటీ, ప్రమోద్ కుమార్ జోషి ఇతర సభ్యులు.