న్యూఢిల్లీ : చమురు, వంట గ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు మంగళవారం దద్దరిల్లాయి. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల గంట పూర్తి కాగానే కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి చమురు ధరల అంశాన్ని లేవ నెత్తారు. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారని ప్రతిపక్ష పార్టీలు ఎప్పటినుంచో చెబుతున్నాయని, ఇప్పుడు అదే జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ , తృణమూల్, ఎన్సీపీ, డీఎంకె, వామపక్షపార్టీ సభ్యులు నినాదాలు చేశారు. విపక్షాలు మాట్లాడేందుకు స్పీకర్ అనుమతినివ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభలో వాయిదాల పర్వం
అటు రాజ్యసభ లోనూ ఇదే గందరగోళం తలెత్తింది. ఈ ఉదయం పెద్దల సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు చమురు ధరలపై ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్మన్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైనా, అదే పరిస్థితి పునరావృతమైంది. టీఎంసీ, కాంగ్రెస్, ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి వెల్‌లోకి దూసుకెళ్లగా, ఇతర ప్రతిపక్ష సభ్యులు టేబుళ్లపై నిల్చుని నిరసన చేపట్టారు. డిప్యూటీ ఛైర్మన్ వారించినా సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దాదాపు ఐదు నెలల తరువాత చమురు ధరలను మంగళవారం పెంచారు. పెట్రోలు , డీజిల్‌పై లీటరుకు 80 పైసలు చొప్పున పెంపు ఉంటుందని చమురు సంస్థలు మంగళవారం ప్రకటించాయి. ఇక వంటగ్యాస్ సిలిండర్ ధరను కూడా రూ.50 పెంచుతున్నట్టు వెల్లడించాయి.