శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆరోపణ
నాగపూర్: పాకిస్తాన్ ఏర్పాటు చేసేందుకు మొహమ్మద్ అలీ జిన్నా భారత్‌ను ఒక్కసారే విభజించాడని, కాని బిజెపి నాయకులు తమ ప్రకటనల ద్వారా హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెడుతూ ప్రతిరోజూ దేశాన్ని చీలుస్తున్నారని శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు. మంగళవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనను బిజెపి జనాబ్ సేనగా అభివర్ణించడాన్ని ఖండించారు. దేశంలో 22 మందికి పైగా ముస్లిం జనాభా ఉందని, వీరిలో చాలా మంది బిజెపికి, శివసేనకు ఓటు వేశారని రౌత్ అన్నారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఎంవిఎ కూటమితో పొత్తు పెట్టుకోవడంపై ఎంఐఎం ఎంపి ఇంతియాత్ జలీల్ చేసిన ప్రతిపాదనను సీనియర్ బిజెపి నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఇటీవల ఎద్దేవా చేయడాన్ని రౌత్ తప్పుపట్టారు. రాష్ట్రీయ ముస్లిం మంచ్ వంటి అనేక ముస్లిం సంఘాలను గతంలో ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ తన పేరును రాష్ట్రీయ ముస్లిం సంఘ్‌గా, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ పేరును జనాబ్ భగవత్‌గా బిజెపి నాయకులు మారుస్తారా అని ఆయన ప్రశ్నించారు.