Saturday, November 23, 2024

ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం

- Advertisement -
- Advertisement -

Ukraine War Effect on Fertilizer Exports

రష్యా దండయాత్రతో తీవ్రమైన ఉక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక రంగంపై రానురాను విపరీత ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌లో ఇంధనం దిగుమతుల వ్యయం రానురాను పెరుగుతుండడంతో అన్ని రంగాల ఆర్థిక స్థితికి నష్టం కలిగిస్తోంది. ముఖ్యంగా ఎరువుల దిగుమతులపై ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది.గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎరువుల లభ్యతలో దేశం స్వయం సామర్ధం సాధించుకోవాలన్న తపనతో కృషి చేస్తున్నప్పటికీ రైతుల అవసరాలు తీర్చడానికి ఇంకా ఎరువుల దిగుమతిపైనే ఆధారపడక తప్పడంలేదు. వాడుకలో ఉన్న ప్రాచుర్యం పొందిన మూడు రకాల ఎరువులను రైతులుసాధారణంగా వినియోగిస్తుంటారు. యూరియా, డై అమోనియం పాస్ఫేట్ (డిఎపి), మ్యురియేట్ ఆఫ్ పొటాష్ (ఎంఒపి) ఈ మూడింటికీ ప్రధాన వనరులు క్రమంగా నైట్రోజన్, పాస్ఫేట్, పొటాష్. యూరియా తయారీకి ముడివనరు అంటే ప్రధాన ఇంధనం నేచరల్ గ్యాస్ (సహజ వాయువు). డై అమోనియం పాస్ఫేట్ ( డిఎపి) తయారీకి ప్రధాన ముడి వనరులు పాస్ఫరిక్ యాసిడ్, అమోనియా. డిఎపి విషయంలో దాదాపు 50 శాతం కావలసినవి భారత్ ఇతర దేశాల నుంచి రప్పించుకోవలసి వస్తుంది. మ్యురియేట్ పొటాష్‌లో (ఎంఒపి)లో మొత్తం రైతులు దిగుమతి చేసుకోవలసి ఉంటుంది.

పాస్ఫరిక్ యాసిడ్, అమోనియా కూడా మొత్తం దిగుమతి చేసుకోవలసిందే. యూరియా విషయానికి వస్తే కావలసినవి ఒకటికి మూడొంతులు (1/3) దిగుమతి చేసుకోక తప్పదు. మిగతా దాంట్లో కూడా రెండింటికి మూడొంతులు (2/3) స్వదేశీయంగా ఉత్పత్తి చేసుకున్నప్పటికీ నేచరల్ గ్యాస్ దిగుమతిపై భారత్ ఆధారపడవలసి వస్తుంది. ( ఇది లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ లేదా ఎల్‌ఎన్‌జి రూపంలో వస్తుంది) ఒకటికి మూడొంతులు ఈ విధంగా వస్తుంది. అదీనూ ఎరువుల తయారీకి ప్రాధాన్యం ఇచ్చి స్వదేశీయంగా సబ్సిడీ ధరకు గ్యాస్ లభిస్తేనే ఎరువులు ఉత్పత్తి అవుతాయి. తరువాత ఇళ్లకు, రవాణాకు గ్యాస్ కేటాయింపు ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తుంది. ఈ రీతిలో ప్రాధాన్యం లభిస్తే ఎల్‌ఎన్‌జి దిగుమతి మరింత పెరుగుతుంది. ఇప్పుడు రణజ్వాలల్లో 1. రష్యా ప్రధాన దురాక్రమణదారు, 2. బెలారస్ (రష్యా ఉత్తరాన సరిహద్దులో ఉంది. రష్యాకు పూర్తి సహకారం అందిస్తూ రెండో ప్రధాన దురాక్రమణదారుగా ఉంది) 3. ఉక్రెయిన్ దాడికి గురౌతున్న బాధిత దేశం) ఈ మూడు దేశాలూ భారత్ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర వహిస్తుంటాయి.

అమోనియా, పొటాష్ సరఫరాలో 23 శాతం రష్యాయే ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోంది. దీంతోపాటు బెలారస్ కూడా పొటాష్ ప్రధాన సరఫరాదారుగా 20 శాతం సరఫరా చేస్తోంది. మొత్తం మీద ఈ రీజియన్ నుంచి 43 శాతం పొటాష్ సరఫరా అవుతుంది. ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే యూరియాలో 14 శాతం ఒక్క రష్యా నుంచే వస్తోంది. డిఎపిలో రష్యా సరఫరా దాదాపు 10 శాతం వరకూ ఉంటోంది. ఇక ఇంధనం విషయంలో ప్రపంచం మొత్తం మీద సహజవాయు ఉత్పత్తిలో 10 శాతం వాటాతో రెండో ఉత్పత్తిదారుగా రష్యా ఉంటోంది. ప్రపంచ దేశాలకు గ్యాస్ ఎగుమతిలో రష్యా వాటా 25 శాతం కన్నా ఎక్కువగా ఉంటోంది. రష్యా నుంచి ఐరోపా యూనియన్ దేశాలు 40 శాతం వరకు గ్యాస్‌ను దిగుమతి చేసుకొంటున్నాయి. అలాగే చమురు ఉత్పత్తిలో ప్రపంచం మొత్తం మీద మూడో ఉత్పతిదారుగా రష్యా ఉంటోంది. ముడి చమురు ఉత్పత్తిలో 12 శాతం రష్యా నుంచే వస్తోంది. భారత్ విషయానికి వస్తే పొటాష్‌లో కావలసినవి 50 శాతం రష్యా, బెలారస్ నుంచే రప్పించుకోక తప్పదు. అమోనియాలో ఎక్కువ భాగం కూడా ఈ రీజియన్ నుంచే వస్తుంది. భారత్ డిఎపి డిమాండ్‌లో దాదాపు 60 శాతం చైనా, సౌదీ అరేబియాల నుంచే నెరవేరుతోంది. యూరియా విషయంలో ఒకటికి మూడొంతులు చైనా, మిగిలిన మూడింట రెండొంతులు మధ్యప్రాచ్యదేశాల నుంచి దిగుమతి అవుతోంది.గ్యాస్ గురించి చూస్తే భారత్‌కు సరఫరా అయ్యే మార్గాలు 10 శాతం నుంచి రష్యా నుంచే కాకుండా వైవిధ్యంగా ఉంటున్నాయి. యుద్ధం తీవ్రమౌతున్న దశలో రష్యా తదితర దేశాల నుంచి సరఫరాలకు భారీ అంతరాయం కలుగుతోంది.

ఐరోపా యూనియన్, అమెరికా దేశాల ఆర్థిక ఆంక్షలు, గనుల తవ్వకం నుంచి ఉత్పత్తి, ఉత్పత్తి నుంచి రోడు, సముద్ర రవాణా మార్గాలు అనుకూలంగా ఉండడం లేదు. నల్లసముద్రంలో యుద్ధ నౌకలు స్థావరం కావడంతో సముద్ర రవాణా స్తంభించిపోతోంది. అయితే ఐరోపా యూనియన్, అమెరికా దేశాలు ఇంధన సరఫరాల విషయంలో తమ స్వంత అవసరాలు నెరవేర్చుకోడానికి వీలుగా ఆర్థిక ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించవచ్చు. స్విఫ్ట్‌లో రష్యా బ్యాంకుల అనుసంధానం నిషేధించడం ఇతర దేశాలకు ఆటంకాలు కలిగిస్తోంది. కనీసం మూడు, నాలుగు నెలల వరకైనా సరఫరాకు ఆటంకాలు ఎదురుకావచ్చు వాస్తవానికి ఈ ఏడాది ఆఖరివరకు సరఫరాకు ఆటంకాలు కొనసాగవచ్చు. నాటో కూటమి దేశాల వల్ల వార్‌జోన్ విస్తరిస్తే చిక్కులు మరింత ఎక్కువై దశాబ్దాల వరకు విపరీత పరిణామాలు ఎదురుకావచ్చు. భారత దేశానికి సరఫరా కరువు కావడమే కాక, దిగుమతుల వ్యయం బిల్లు కూడా పెరుగుతుంది. గరిష్ఠంగా పొటాష్ సరఫరాల్లో ఈ ఆటంకాలు బాగా ఉంటాయి. రష్యా, బెలారస్ వల్ల మన అవసరాలు 50 శాతం వరకు తీరుతున్నాయి. కానీ ఈ రీజియన్‌లో మనం ఆధారపడడం తక్కువే అయినా సరఫరాలో భారీ కోత కారణంగా భారత్ ఎక్కువగా బిల్లు చెల్లించవలసి వస్తోంది. స్వేచ్ఛా విపణి నేపథ్యంలో ఈ పరిశ్రమ తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఎరువుల కోసం రైతులు ఎక్కువ ధరలు చెల్లించవలసి వస్తుంది. కానీ నియంత్రణలో ఉన్న ఎరువుల విషయంలో అలా జరగక పోవచ్చు.

కొన్ని దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల ఉత్పత్తి , దిగుమతి, సరఫరా వ్యయాలతో సంబంధం లేకుండా ఎరువుల గరిష్ఠ ధరలు రైతులపై పడకుండా ఒక వ్యవస్థను నిర్వహిస్తోంది. ఆ మేరకు ఎరువుల ఉత్పత్తి దారునికి, దిగుమతి దారునికి, ధరల పెంపువల్ల వచ్చే లోటును బడ్జెట్‌లోని కేటాయించిన సబ్సిడీ రూపంలో భర్తీ చేస్తోం ది. అధిక వ్యయం నుంచి రైతులను, పరిశ్రమను ఈ వ్యవస్థ రక్షించ గలుగుతోంది. 2021 22 లో కూడా దాదాపు అన్ని ఎరువుల ధరలు హద్దుపద్దు లేకుండా పెరిగాయి. ఇంధనం వ్యయం, ధర పెరగడంతో డిఎపి ధర రెట్టింపు మించి పెరగ్గా, యూరియా, ఎంఒపి ధరలు మూడింతలు పెరిగాయి. భారీ ఎగుమతిదారులు ఎరువుల ధరలను అమాంతంగా పెంచేశారు. పెరిగిన వ్యయాన్ని ఉత్పత్తిదారులకు భర్తీ చేయడానికి సబ్సిడీని పెంచారు. బడ్జెట్‌లో రూ.80,000 కోట్లు కేటాయించగా, పరిధిని మించి సబ్సిడీని రూ. 60,000 కోట్లు కేటాయించారు. 202122 లో ఎరువుల సబ్సిడీకి 1,40,000 కోట్ల వరకు ఖర్చు చేయగా, 202223 లో సబ్సిడీ కేటాయింపును ఆర్థిక మంత్రి సీతారామన్ రూ.1,05, 000 కోట్లకు తగ్గించారు. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత అధిక స్థాయిలో ఉన్న ధరలు తగ్గుతాయని భావించినప్పటికీ ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం దృష్టా ఆ అంచనాలు తారుమారయ్యాయి. ధరలు మరింత పెరుగుతాయి కూడా. లిక్విడ్ నేచరల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) దిగుమతి ధర ఈపాటికే మిలియన్ బిటియుకి 40 అమెరికా డాలర్ల వంతున పెరిగింది.

(202122 లో మిలియన్ బిటియు ధర 20 డాలర్లు వరకు ఉండేది).(బిటియు అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్. నేచరల్ గ్యాస్‌కు ఈ ప్రమాణాన్నే వాడతారు. 1.000.000 ఎంఎంబిటియు అంటే ఒక మిలియన్ క్యూబిక్ ఫీట్). ఈ నేపథ్యంలో ప్రభుత్వం కనీసం రూ. 1,50,000 కోట్ల వరకైనా కేటాయింపు పెంచవలసి ఉంటుంది. లేదా పెరిగిన వ్యయంపై ఆధారపడక తప్పదు. ప్రాథమిక దృష్టిలో ద్రవ్యలోటు లక్షం 6.4 శాతం వరకు లేదా రూ. 16,60,000 కోట్లు వరకు సబ్సిడీ బిల్లు పెరుగుతుంది. భారత్ కావలసిన ఎరువులను సమకూర్చుకోలేకుంటే ఏదెలాగున్నా సరఫరా కొరతను భారత్ నియంత్రించలేదు. ఇక్కడ పెద్ద సమస్య ఏదంటే ఆర్థిక లోటు భర్తీ అన్నది శాశ్వతంగా సమకూరక పోవచ్చు. 202122 బడ్జెట్‌లో ఆర్థిక సడలింపులను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినా 202526 నాటికి ప్రభుత్వం 4.5 శాతం వరకు తగ్గించి వేస్తుంది. భారత్ దిగుమతులపై ఆధారపడడం తగ్గించగలిగితేనే సబ్సిడీలకు పగ్గాలు వేయడం సాధ్యమౌతుంది. గతంలో స్వల్పం గా కొంతవరకు ఇది సాధించగలిగినా తిరిగి అదే విధం గా సాధించగలమన్న నమ్మకం కుదరడం లేదు.

1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన నాటి నుంచి ఎరువుల రంగం లో కూడా సంస్కరణలకు ప్రయత్నాలు జరిగాయి. ఎరువుల సబ్సిడీ బిల్లు భారం తగ్గించడానికి, నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియం ఎరువులను తులనాత్మకంగా సరిగ్గా వినియోగించడానికి, ఎరువుల వల్ల నీరు, గాలి కాలుష్యాల శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయి. 1981 నుంచి 1991 జులై వరకు ఎరువుల ధరల్లో మార్పు జరగలేదు. 1991 బడ్జెట్‌లో ఎరువుల ధరలు సరాసరిన 40 శాతం పెరిగినా అదే ఏడాది ఆగస్టులో 30 శాతం వరకు తగ్గాయి. పెరిగిన ధరల నుంచి చిన్న, మధ్యతరహా రైతులను మినహాయించి సబ్సిడీ కల్పించారు. విపక్షాల ఆందోళనతో యూరియా ధరలు తిరిగి 17 శాతం వరకు తగ్గించారు. ఈ మార్పు ఎరువుల ధరల అస్థిరత్వానికి దారి తీసింది. యూరియా, నైట్రోజన్‌కు అనుకూలంగా ఎరువుల వినియోగం పెరిగింది. నైట్రోజన్, పొటాషియం, పాస్ఫరస్ వినియోగం 199192 లో 5.9: 2.4: 1 నిష్పత్తిలో ఉండగా, 9394 లో 9.7: 2.9:1 నిష్పత్తిలో ఉంది. అయితే గత రెండు దశాబ్దాల్లో ఎరువుల విధానం, ధరల మార్పు అనుకూల పరిణామాలను తారుమారు చేసింది. మూడేళ్లలో ఎరువుల సబ్సిడీ రెట్టింపు అయింది.

2017 18 లో బడ్జెట్‌లో ఎరువుల సబ్సిడీకి రూ.66,468 కోట్ల వరకు కేటాయించగా, 2021 22 లో రూ.79,530 కోట్లకు కేటాయింపు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో యూరియా ధరలు, ఇతర ఎరువుల ధరలు పెరిగినా దిగుమతులపై భారత్ ఆధారపడక తప్పలేదు. యూరియాలో దేశం మొత్తం మీద డిమాండ్ 34 మిలియన్ల నుంచి 35 మిలియన్ టన్నుల వరకు డిమాండ్ ఉండగా, స్వదేశీపరంగా కేవలం 25 మిలియన్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. డై అమోనియా పాస్ఫేట్ (డిఎపి) అవసరం 12 మిలియన్ టన్నులు కాగా, స్వదేశీయంగా 5 మిలియన్ టన్నులే ఉత్పత్తి అవుతోంది. ఈ తేడా యూరియాకు 9 నుంచి 10 మిలియన్ టన్నులు, డిఎపికి 7 మిలియన్ టన్నుల వరకు ఉంటోంది. ఇక మ్యూరేట్ ఆఫ్ పొటాసియం వినియోగం 3 మిలియన్ టన్నులే అయినా ఈ మొత్తం అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిందే. ఇంధన ధరల ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు మార్పు చెందుతున్నాయి. యూరియా ధరలు టన్నుకు 900 డాలర్లు వంతున 2021 నవంబరులో పెరిగాయి. అంతకు ముందు 2020 సెప్టెంబరులో టన్నుకు 825 డాలర్లు వరకు ఉండేవి. ఇంధనం ధరలు పెరగడం, సరఫరాలో ఆటంకాలు, స్వదేశీ పరంగా భారీ డిమాండ్ ఇవన్నీ ఎరువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రబీ సీజన్‌లో ఈ ధరల ప్రభావం రైతులపై పడకుండా ప్రభుత్వం సబ్సిడీని పెంచింది. ఫలితంగా ఆర్థిక పరంగా తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయి.

గత ఇరవై ఏళ్లలో కిలోకు రూ.5.36 వంతున 2021 లో యూరియా ధర పెరిగింది. అంతకు ముందు 2001 లో కేవలం రూ.4.60 మాత్రమే ఉండేది. అదేకాలంలో వరిధాన్యం మద్దతుధర 280 శాతం వరకు పెరిగింది. 2001 లో 37.7 కిలోల గోధుమకు 50 కిలోల బస్తా యూరియా అవసరం అయ్యేది. ఇప్పుడు అది 13.3 కిలోలకు తగ్గింది. ప్రస్తుత ధరల ప్రకారం బస్తా యూరియాకు కేంద్ర ప్రభుత్వం రూ. 930 వంతున సబ్సిడీ ఇస్తుండగా, రైతులు తమ వంతుగా రూ. 268 చెల్లిస్తున్నారు. ఎరువుల విధానంలో బహుళ లక్షాలను సాధించుకోడానికి ఏకకాలంలో నాలుగు కీలకాంశాలపై మనం పనిచేయవలసి వస్తుంది. స్వయం స్వావలంబన, ఎరువుల దిగుమతిపై ఆధారపడడం తగ్గించడం మొదట చేయగలిగితే అంతర్జాతీయ మార్కెట్ లోని నిలకడలేని ధరల భారం నుంచి బయటపడగలుగుతాం. గోరఖ్‌పూర్, సింద్రీ, బరౌమీ, తాల్చేరు, రామగుండం, ఎరువుల ప్లాంట్లను ప్రభుత్వపరంగా పునరుద్ధరించుకోవాలి. యూరియా ధరల నిర్ణయంలో సబ్సిడీ కేటాయింపు విధానంలో ప్రస్తుత విధానంలో సంస్కరణలు అవసరం. పంటల పోషకాలకు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలి. రసాయనేతర ఎరువులను రైతులు వినియోగించేలా రైతులతో చర్చలు జరిపి ఆచరణ మార్గాలను సూచించాలి. ఎప్పటికప్పుడు వారికి చేదోడుగా ఉండాలి. కంపోస్ట్ ఎరువుల్లో నైట్రోజన్ తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పుడు అందుబాటులోకి అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ వల్ల నైట్రోజన్ స్థాయిలు పుష్కలంగా లభిస్తాయి.

కె. యాదగిరి రెడ్డి- 9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News