రాఘవాపూర్: నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని రాబోయే రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు. సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కేజీబీవీ పాఠశాల తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేజీబీవీ విద్యార్థినీలు రాష్ట్ర స్థాయిలో టాపర్ గా ఉండాలని పోటీపడి చదివి పైకి ఎదగాలన్నారు. రాబోయే రోజుల్లో మీరంతా పాస్ కావాలని చదవొద్దని.. ర్యాంకు రావాలని చదవాలని కోరారు. అసెంబ్లీ సాక్షిగా సిఎం కెసిఆర్ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఖరారు చేశారని, ఇదివరకే 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే సిద్దిపేట లైబ్రరీలో చదువుకునే నిరుద్యోగులకు కడుపునిండా ఉచిత భోజనం పెడతామని, నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని అన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు కోసం ఉచితంగా కేసీఆర్ కోచింగ్ కేంద్రం నిర్వహణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేరిట ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు, సిద్ధిపేటలో పోటీ పరీక్షలకు, కానిస్టేబుల్ శిక్షణకు, గ్రూపు 1, 2, 3, 4 అన్నీ రకాల ఉద్యోగాలకు పైసా ఖర్చు లేకుండా హైదరాబాదు నుంచి నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు. యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
Free Coaching to Un Employees in Siddipet: Harish Rao