న్యూఢిల్లీ: డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు శనివారం వాఖెడే స్టేడియంలో లాస్ట్ ఎడిషన్ రన్నరప్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తమ క్యాంపెయిన్ ఓపెనింగ్ చేయనున్నది. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) ఏర్పడినప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కె) జట్టుకు సారధ్యం వహిస్తున్న ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతలను గురువారం రవీంద్ర జడేజాకు అప్పజెప్పారు. ఐపిఎల్ 2022 సీజన్ మొదలుకాడానికి ఇంకా కేవలం రెండు రోజులుందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నాయకత్వ బాధ్యతలను జడేజాకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. జడేజా 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అంతర్భాగంగా ఉన్నారు. సిఎస్‌కె నాయకత్వం వహించబోతున్న ఆయన మూడో ప్లేర్. ఇదిలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజనులోనూ, ఆ తర్వాత కూడా ధోనీ ప్రాతినిధ్యం వహిస్తారు’ అని సిఎస్‌కె తన ప్రకటనలో పేర్కొంది. ధోని ఇప్పటి వరకు సిఎస్‌కెను నాలుగుసార్లు గెలిపించారు. బహుశా ఈ సీజనులో ఆయన ఆడనున్న ఆఖరి ఐపిఎల్ ఇదే కావొచ్చు. 40 ఏళ్లు ఉన్న ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. రవీంద్ర జడేజా ఇదివరలో 2007 అక్టోబర్ 28న కెప్టెన్షిప్ బాధ్యతలు చేపట్టారు. అది కూడా అండర్ 19 గ్రూప్ జట్టుకు. రాజ్‌కోట్‌లోని వెస్టర్న్ రైల్వే గ్రౌండ్‌లో వినూ మన్‌కడ్ అండర్ 19 టోర్నమెంట్‌లో ముంబయికి వ్యతిరేకంగా ఆడిన సౌరాష్ట్ర అండర్ 19 జట్టుకు రవీంద్ర జడేజా కెప్టెన్షిప్ చేపట్టారు. ఐసిసి బుధవారం విడుదల చేసిన తాజా ఆల్‌రౌండర్స్ ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జడేజా టాప్ స్పాట్‌లో నిలిచారు. ఆయన వెస్టీండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్‌ను పక్కకు తప్పించి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నెల మొదట్లో మొహాలిలో శ్రీలంకతో ఆడిన మొదటి టెస్ట్‌లో జడేజా 175 నాటౌట్, తొమ్మిది వికెట్లతో నెం. 1 స్థానానికి ఎదిగాడు.
ఐపిఎల్ 2022 – ధోని నుంచి రవీంద్ర జడేజాకు సిఎస్‌కె కెప్టెన్సీ !
- Advertisement -
- Advertisement -
- Advertisement -