సియోల్: అమెరికా, దక్షిణ కొరియా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణుల ప్రయోగాలను సాగిస్తోంది. తాజాగా ఆ దేశం తన తూర్పు తీరం నుంచి గుర్తు తెలియని ప్రొజెక్టైల్‌ను ప్రయోగించినట్టు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. జపాన్ కోస్ట్‌గార్డ్ కూడా దీన్ని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంగా అనుమానిస్తూ తమ నౌకలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ క్షిపణి తమ ప్రత్యేక ఆర్థిక జోన్ (ఈఈజడ్) జలాల్లో పడిపోయినట్టు జపాన్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత విశ్లేషణల ప్రకారం ఆ బాలిస్టిక్ క్షిపణి 71 నిమిషాల పాటు గాల్లో ఎగిరి… హొక్కైదొ ఒషిమా ద్వీపకల్పానికి తూర్పున 150 కిమీ దూరంలో జపాన్ సముద్రంలోని తమ ప్రత్యేక ఆర్థిక జోన్ జలాల్లో పడిపోయిందని ఆ దేశ రక్షణశాఖ మంత్రి మకోటో ఒనికి చెప్పారు. ఈ ప్రయోగాన్ని దక్షిణ కొరియా, జపాన్‌లు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) ప్రయోగంగా భావిస్తున్నాయి. ఇది ఆరువేల కిమీ కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణించిందని, 2017 నవంబరులో ప్రయోగించిన హ్వాసాంగ్ 15 ఐసిబీఎం కంటే చాలా ఎక్కువని జపాన్ మంత్రి ఒనికి తెలిపారు.
North Korea launches another missile