పలు కీలక అంశాలపై దృష్టి
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలలో ఎదురుదెబ్బలు, అసమ్మతి స్వరాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శనివారం అత్యంత కీలకమైన సమీక్షా సమావేశం నిర్వహించింది. ప్రత్యేకించి పార్టీలోని సంస్థాగత పదవులలోని వారు ఈ భేటీకి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాలలో పార్టీ ఇన్‌ఛార్జిలు ఈ భేటీకి హాజరయ్యారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రియాంక గాంధీ, ఊమెన్ చాందీ, ముకుల్ వాస్నిక్, తారిక్ అన్వర్, సూర్జేవాలా, అజయ్ మకెన్, కోశాధికారి పవన్‌కుమార్ బన్సాల్ ఇతరులు పాల్గొన్నారు. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియ గురించి సమీక్ష జరిగింది. ఐదు రాష్ట్రాలు ప్రత్యేకించి పంజాబ్‌లో ఓటమి, ఉత్తరప్రదేశ్‌లో అత్యంత పేలవపరిస్థితిపై నేతలు దృష్టి సారించారు. అన్ని స్థాయిల్లోనూ పార్టీని అంతర్గత సంస్థాగత బలోపేతం చేస్తూనే, వివిధ స్థాయిలలో ప్రజా ఆందోళనల ద్వారా మరింతగా కార్యకర్తలు నేతలు ప్రజలకు చేరువ కావాల్సి ఉందని ఈ భేటీలో నిర్ణయించారు.