పోలెండ్ అధ్యక్షునికి ధైర్యం చెప్పిన బైడెన్
వార్షా : రష్యా దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని , పొరుగునున్న ఉక్రెయిన్ నుంచి తరలివచ్చే శరణార్ధుల భారాన్ని తామే వహిస్తామని పోలెండ్‌కు అమెరికా అధ్యక్షుడు బైడెన్ పదేపదే ధైర్యం చెప్పారు. మీ స్వేచ్ఛ మాబాధ్యత అని పోలెండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ డుడాకు ఆయన భరోసా ఇచ్చారు. యూరప్‌లో తన పర్యటన ఆఖరి రోజున బైడెన్ వార్షా లోని అధ్యక్ష భవనంలో పోలెండ్ అధ్యక్షునితో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి ఏయే లక్షాలు సాధించాలో పరస్పరం గౌరవ పూర్వకంగా చర్చించుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పోలిష్‌అమెరికన్ సంబంధాలు వెల్లివిరుస్తున్నాయని డుడా పేర్కొన్నారు. యుద్ధం ఆరంభమైన దగ్గర నుంచి ఉక్రెయిన్ నుంచి తరలిపోయిన 3.7 మిలియన్ మందిలో 2 మిలియన్ మంది పోలెండ్‌లో ఉన్నారు. ఈ వారం మొదట్లో లక్ష మంది శరణార్ధుల భారం వహిస్తామని అమెరికా ప్రకటించింది. పోలెండ్ చాలా పెద్ద బాధ్యత వహిస్తుండడం తాను అర్థం చేసుకుంటున్నానని, కానీ ఇదంతా నాటో కూటమి బాధ్యతని బైడెన్ పేర్కొన్నారు.