క్రైస్ట్‌చర్చ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ 71 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచిన కివీస్‌కు సెమీస్ బెర్త్ కష్టమేనని చెప్పాలి. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తరవాత బ్యాటిగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 194 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. హన్నా రొవే మెరుగైన బౌలింగ్‌ను కనబరిచింది. 55 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది.
ఫ్రాన్సెస్ మాక్‌కె రెండు వికెట్లు పడగొట్టి తనవంతు పాత్ర పోషించింది. జెస్ కెర్, అమెలియా కేర్, రోస్ మేరీ తదితరులు కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. పాకిస్థాన్ జట్టులో నిదా దర్ (50), కెప్టెన్ బిస్మా మారూఫ్ (38), ఓపెనర్ మునీబా (29) మాత్రమే రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ను ఓపెనర్ సుజి బేట్స్ ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన బేట్స్ 14 ఫోర్లతో 126 పరుగులు చేసింది. దీంతో కివీస్ మెరుగైన స్కోరును సాధించింది.