అత్యవసర వినియోగానికి డిసిజికి దరఖాస్తు
దేశంలో పెరుగుతున్న క్షయ కేసులు, మరణాలు
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్న క్షయ వ్యాధి వ్యాప్తిని నివారించడానికి రీకాంబినెంట్ బిసిజి (ఆర్ బిసిజి) వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డిసిజిఐ) కు సీరం ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తు చేసింది. ఈ మేరకు దరఖాస్తును సీరం ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డైరక్టర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ప్రకాష్‌కుమార్ సింగ్ మార్చి 22న సమర్పించారు. దేశంలో టిబి నివారణ కార్యక్రమం కోసం ప్రస్తుతం బిసిజి టీకాలు అవసరమౌతున్నాయి. పుట్టిన పిల్లలకు, లేదా ఏడాది లోపు పిల్లలకు ఈ టీకాలు వేస్తారు. సార్వత్రిక టీకా కార్యక్రమం కింద నుమోకాకల్, ఐపివి, రొటావైరస్‌ల నుంచి రక్షణ పొందేందకు సీరం ఇనిస్టిట్యూట్ ఈపాటికే ప్రభుత్వానికి వ్యాక్సిన్లు సరఫరా చేసిందని దరఖాస్తు లేఖలో సింగ్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి బిసిజి సరఫరా చేసే సంస్థల్లో సీరం ఇనిస్టిట్యూట్ ఒకటి. 2025 నాటికి క్షయ విముక్త భారత్ సాధించాలని ఐదేళ్లు ముందుగానే ప్రధాని మోడీ పిలుపునిచ్చారని సింగ్ పేర్కొన్నారు. దీనిపై సీరం సంస్థ పిల్లలు, పెద్దలకు సమర్థమైన, అత్యంత నాణ్యమైన ట్యూబర్ వాక్ ఆర్ బిసిజి వ్యాక్సిన్‌ను సరసమైన ధరలకు అందుబాటు లోకి తెస్తున్నట్టు సింగ్ ప్రస్తావించారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న బిసిజి వ్యాక్సిన్ కన్నా మరింత సమర్ధమైన రీకాంబినంట్ బిసిజి వ్యాక్సిన్లను అత్యంత ఆధునిక సాంకేతిక ప్రక్రియలతో తయారు చేస్తున్నారు. దేశంలో ఇదివరకు కన్నా 2021 లో టిబి కేసులు 19 శాతం పెరిగాయి. వివిధ రకాల క్షయవల్ల 2019 20 మధ్యకాలంలో 11 శాతం మరణాల రేటు పెరిగిందని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ విడుదల చేసిన టిబి వార్షిక నివేదిక వెల్లడించింది.