Monday, November 25, 2024

చైనాతో షరా మామూలే!

- Advertisement -
- Advertisement -

Centre Withdraws Covid 19 Restrictions

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ అకస్మాత్తుగా ఇండియా వచ్చి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌తో మాట్లాడి వెళ్లిన పరిణామానికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, దానిపై భారత్, చైనాలు రెండూ దాదాపు ఒకే వైపునున్న నేపథ్యంలో వాంగ్ ఇ రాకకు ప్రత్యేకత ఏర్పడుతుందని ఆశించిన వారికి ఆ వైపుగా కూడా గొప్ప సంకేతాలేమీ కనిపించలేదు. రెండు దేశాల విదేశాంగ మంత్రులు యుద్ధ విరమణను కోరుతూ లాంఛనంగా ప్రకటన ఇవ్వడం తప్ప వేరేమీ జరగలేదు. భారత్ చైనా సరిహద్దు ప్రతిష్టంభన, ఉక్రెయిన్ యుద్ధం, ఈ ఏడాది చివరిలో జరగనున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సభలో ఇండియా పాల్గొనడం వంటి అంశాలపై చర్చించినట్టు వార్తలు వచ్చినప్పటికీ అవి కేవలం మామూలు ప్రస్తావనలుగానే సాగాయని బోధపడుతున్నది. చైనా విదేశాంగ మంత్రితో చర్చల్లో తాను నిజాయితీగా వ్యవహరించినట్టు భారత జాతీయ మనోభావాలను వ్యక్తం చేసినట్టు మన విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. 2020 ఏప్రిల్‌లో సరిహద్దుల్లో చైనా ప్రదర్శించిన దూకుడు తర్వాత చెడిపోయిన సంబంధాలు తిరిగి మామూలు స్థాయికి చేరుకోడమనేది సులభంగా జరిగేది కాదని కూడా జైశంకర్ అభిప్రాయపడ్డారంటే వాంగ్ ఇ సందర్శన వల్ల ఒరిగిందేమీ లేదని స్పష్టపడుతుంది. రెండు వైపుల వారూ కలిసి విభేదాలను పరిష్కరించుకోవాలని, చైనా భారత్‌లు ఒక్క త్రాటి మీదికి వచ్చి ఒక్క కంఠంతో మాట్లాడితే ప్రపంచం తప్పని సరిగా వింటుందని వాంగ్ ఇ అన్నారు. కాని అందుకోసం తాము ఏమి చేయదలచుకున్నారు, వివాదాస్పద వాస్తవాధీన రేఖను సుస్థిర, ప్రశాంత సరిహద్దుగా మార్చుకునే విషయంలో తమ వైఖరి ఏమిటి అనేది ఆయన చెప్పలేదు. చైనా అధికారికంగా తన అభిప్రాయమేమిటో తెలియజేసే అవకాశాలు కనిపించడం లేదు. అప్పుడప్పుడూ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉద్రిక్తతలను రెచ్చగొట్టడమే ఏకైక కార్యక్రమంగా అది వ్యవహరిస్తున్నది. దీని వల్ల 2020 ఏప్రిల్ తర్వాత నుంచి భారత చైనా సరిహద్దులు ఎప్పుడూ లేనంతగా ఇరువైపులా సేనల సమీకరణతో అత్యంత ఉద్రిక్తంగా మారిపోయింది. 1964 నాటి యుద్ధం తర్వాత 56 సంవత్సరాల పాటు ప్రశాంతంగా వున్న భారత చైనా సరిహద్దులు మళ్లీ ఆ స్థితికి చేరుకోవలసి వుంది. ఉక్రెయిన్ విషయంలో రెండు దేశాలు తటస్థ వైఖరిని ప్రదర్శించడం భవిష్యత్తులో అవతరించబోయే నూతన ప్రపంచ సమీకరణలకు దోహదకారిగా వుండవచ్చు. ముఖ్యంగా ఇండియా కూడా అప్రకటిత రష్యా అనుకూల వైఖరిని తీసుకోడం, అమెరికాను ఖాతరు చేయకుండా మాస్కో నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోడానికి నిర్ణయించడం భావి అంతర్జాతీయ సంబంధాల్లో కొత్త మలుపును సూచిస్తున్నది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో ఏర్పడిన నాలుగు దేశాల కూటమి క్వాడ్‌లో చేరి కూడా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం విషయంలో ఆ కూటమి దేశాల వైఖరితో నిమిత్తం లేకుండా భారత్ స్వతంత్ర ధోరణిని తీసుకున్నది. ఇది భారత్ చైనాలను భవిష్యత్తులో మళ్లీ చేరువ చేసే అవకాశాలున్నాయేమో చూడాలి. ఇప్పటికైతే అటువంటిదేదీ కనిపించడం లేదు. యుద్ధంపై భద్రతా మండలి ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడం, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోడం అమెరికాకు బొత్తిగా ఇష్టం లేదనే సంగతి పదేపదే వెల్లడవుతున్నది. తన మాట కాదని యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులను కొనసాగించడం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అసంతృప్తి కలిగించింది. ఈ విషయంలో యూరప్ దేశాలను కట్టడి చేయలేకపోయిన అమెరికా అదే కారణం మీద ఇండియాపై ఆంక్షలకు తొందరపడలేకపోయింది. మొత్తం మీద భవిష్యత్ ప్రపంచ సంబంధాలపరంగా భారత్ పాత్రకు ప్రాధాన్యం పెరిగిన మాట వాస్తవం. జపాన్ విదేశాంగ మంత్రి కూడా మన దేశంలో పర్యటించారు. రష్యా విదేశాంగ మంత్రి రానున్నారు. ఈ పరిణామాలు పెరిగిన భారత్ ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయని బిజెపి అనుకూల శక్తులు ప్రచారం చేస్తున్నాయి. వాంగ్ ఇ మొన్న ఇండియా సందర్శించడానికి ముందు మూడు రోజుల పాటు పాకిస్తాన్‌లో వున్నారు. ఆ సందర్భంలో అక్కడ జరిగిన ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ(ఒఐసి) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కశ్మీర్ విషయంలో ఒఐసి అభిప్రాయంతో చైనా ఏకీభవిస్తున్నదని వాంగ్ ఇ ఆ సమావేశంలో ప్రకటించారు. అందుచేత భారత్ చైనాల మధ్య గల మౌలిక విభేదాలు తొలగితే గాని రెండు దేశాలూ ఒక్క త్రాటిమీదకు రావడమనేది జరగదు. ఏ కారణంగానైనా రెండు దేశాల ముఖ్యులూ తరచూ కలుసుకొని మాట్లాడుతుండడం హర్షించదగినది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పూర్తిగా తొలగకపోయినా అవి రగలకుండా ఉండడానికి ఈ కలయికలు తోడ్పడతాయి.

Wang Yi holds meet with Jaishankar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News