ఎంఎల్ సి కవిత కౌంటర్
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. కేంద్రం మాత్రం నిబంధనలకు తగ్గట్లే అన్ని రాష్ట్రాల్లోనూ కొనుగోళ్లు జరుగుతాయని, తెలంగాణ అందుకు మినహాయింపు ఏమాత్రం కాదని స్పష్టం చేసింది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలుగులో మంగళవారం ఓ ట్వీట్ చేశారాయన. ‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్ చేశారు.
మరోపక్క తెలంగాణ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ నిరసనలకు పిలుపు ఇచ్చింది.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ ట్వీట్ పట్ల టీఆర్‌ఎస్ తరపున కల్వకుంట్ల స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ పిలుపు ఇచ్చారు.
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.
రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
— Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022