కొలంబో : శ్రీలంక లోని ఉత్తర జాఫ్నాకు చెందిన మూడు ద్వీపాల్లో ఇదివరకు చైనా నెలకొల్పాలనుకున్న హైబ్రిడ్ పవర్ ప్లాంట్లకు బదులుగా భారత్ ఆధ్వర్యాన హైబ్రిడ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి భారత్,శ్రీలంక మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. కొలంబోలో జరుగుతున్న బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొన్న భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి జిఎల్ పెయిరిస్‌తో కలిసి సోమవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని భారత దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జాఫ్నా తీరం లోని నైనతీవు, నెడుంతీవు, అనాలైతీవు దీవుల్లో హైబ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థలను నెలకొల్పడానికి 2021 జనవరిలో చైనా సంస్థ సినోసార్ ఎటెచ్విన్ ముందుకొచ్చింది. అయితే ఆ దీవులు తమిళనాడుకు చేరువలో ఉండడంతో భద్రతా సమస్యలు ఎదురవుతాయని భారత్ నుంచి అభ్యంతరాలు తలెత్తడంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. చైనా వివాదాస్పద బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు కింద శ్రీలంకలో వివిధ మౌలిక వనరులకు సంబంధించిన ప్రాజెక్టులకు చైనా పెట్టుబడులు పెడుతోంది. చైనా తన రుణ ఊబిలోకి శ్రీలంకను లాగుతోందని దేశీయంగా, అంతర్జాతీయంగా విమర్శలు తలెత్తుతున్నాయి.