Saturday, November 23, 2024

యుద్ధంపై చర్చల్లో ప్రగతి

- Advertisement -
- Advertisement -

 

Progress in Russia-Ukraine talks

కీవ్, చేర్నోహిల్ నుంచి సైన్యం ఉపసంహరణకు రష్యా అంగీకారం
టర్కీలో చర్చలు బాగా జరిగాయని ఉక్రెయిన్ ప్రకటన
పుతిన్, జెలెన్‌స్కీ మధ్య ముఖాముఖీ చర్చలకు అవకాశం

ఇస్తాంబుల్: నెల రోజులకు పైగా జరుగుతున్న రష్యాఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ రెండు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చల్లో పురోగతి చోటు చేసుకుంది. చర్చల అనంతరం ఉక్రెయిన్‌పై సైనిక కార్యకలాపాల తగ్గింపునకు రష్యా అంగీకరించింది. రాజధాని కీవ్, చెర్నిహివ్ నగరాలనుంచి బలగాల ఉపసంహరణకు క్రెమ్లిన్ అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో మంగళవారం దాదాపు మూడు గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. ఉక్రెయిన్‌తో చర్చలు అర్థవంతంగా సాగినట్లు చర్చల్లో రష్యా తరఫు బృందాలనికి నాయకత్వం వహించిన వ్లాదిమిర్ మెడిన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్ ప్రతిపాదనలను అధ్యక్షుడు పుతిన్ ముందుంచుతామని కూడా ఆయన చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు.‘ ఈ రోజు జరిగిన అర్థవంతమైన చర్చల తర్వాత ఇరుపక్షాలు ఒక ప్రతిపాదనకు అంగీకరించాయి.

దీని ప్రకారం ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై చర్చిస్తారు. ఎంత త్వరగా అవసరమైన రాజీ కుదిరి అంగీకారానికి వస్తామనే దాన్ని బట్టి శాంతి కుదిరే అవకాశాలు అంతగా చేరువవుతాయి’ అని మెడిన్‌స్కీ చెప్పారు. కాగా ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉండడంపై ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు వీలుగా చర్చలు జరగనున్న దృష్టా కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను గణనీయంగా తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని రష్యా డిప్యూటీ రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ చెప్పారు.

ఇదిలా ఉండగా టర్కీలో జరిగిన చర్చల్లో రష్యాతో యుద్ధానికి ముగింపు పలికేంతగా పురోగతి సాధించినట్లు, ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సమావేశం జరిగేందుకు వీలు కలిగినట్లు చర్చల్లో ఉక్రెయిన్ తరఫు బృందానికి నేతృత్వం వహించిన డేవిడ్ అర్కమియా చెప్పారు. కాగా ఉక్రెయిన్‌లో మానవతా పరిస్థితితో పాటుగా ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకుండా తటస్థ దేశంగా ఉండాలన్న రష్యా డిమాండ్‌పైనా ప్రధానంగా ఈ చర్చల్లో చర్చించినట్లు తెలుస్తోంది.

యూరప్ దేశాల నేతలతో నేడు బైడెన్ చర్చలు

ఇదిలా ఉండగా ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం ఆయా యూరప్ మిత్ర దేశాలతో ఫోన్‌ద్వారా చర్చలు జరుపుతారని వైట్‌హౌస్ తాజాగా వెల్లడించింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నాయకులతో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలకు సంబంధించిన తాజా పరిణామాలపై మాట్లాడుతారని తెలిపింది.
మైకలైవ్ పరిపాలనా భవనంపై దాడి: ఏడుగురు మృతి

ఓ వైపు చర్చలకు సిద్ధమవుతూనే మరో వైపు రష్యా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. తాజాగా మైకలైవ్ నగరంలోని పరిపాలనా భవనంపై క్షిపణి దాడి జరిపిందని స్థానిక గవర్నర్ విటాలి కిమ్ చెప్పారు. అందులోని సిబ్బంది చాలా వరకు తప్పించుకోగలిగారని ఆయన తెలిపారు. అయితే శిథిలాల కింద సహాయక సిబ్బంది ఏడుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. మరో 22 మంది గాయపడినట్లు పేర్కొన్నాయి. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. డెన్మార్క్ పార్లమెంటునుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News