వనరుల సమీకరణ కోసం పన్నుల భారం వేయలేదు
ఆశించిన రికవరీ సాధిస్తాం: ఆర్థిక మంత్రి హామీ
న్యూఢిల్లీ: యుపిఎ పదేళ్ల పాలనతో పోలిస్తే నరేంద్ర మోడీ హయాంలోనే దేశంలోకి విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మోడీ పాలనలో 500 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐలు రాగా.. యుపిఎ ప్రభుత్వ పదేళ్ల పాలనతో పోలిస్తే ఇవి 65 శాతం ఎక్కువని ఆమె అన్నారు. ఇక కరోనా మాదిరిగానే ఉక్రెయిన్ సంక్షోభం అన్ని దేశాలను ప్రభావితం చేస్తోందన్న ఆమె.. అంతర్జాతీయంగా సరఫరా చైన్ వ్యవస్థల్లో తీవ్ర అంతరాయం వల్లే ఈ సమస్య వస్తోందన్నారు. రాజ్యసభలో మంగళవారం బడ్జెట్‌పై చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ఆర్థిక పునరుద్ధరణ కోసం తమ ప్రభుత్వం పన్నుల భారాన్ని మోపలేదన్నారు. బడ్జెట్ సమర్పణలో తాను ఒమిక్రాన్‌ను పరిగణలోకి తీసుకోలేదని, అయితే ఇప్పుడు రష్యాఉక్రెయిన్ యుద్ధం మనముందు కొత్త సవాళ్లని ఉంచిందనిఆమె అన్నారు.
కరోనా లాగే అన్ని దేశాలు కూడా దీని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వనరుల కోసం కొత్తగా పన్నులు వేయడానికి పూనుకోలేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.ఆశించిన రికవరీ సాధిస్తామన్నవిశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. మంత్రి సమాధానం అనంతరం ఎగువ సభ ఎలాంటి మార్పులు లేకుండానే అనుబంధ పద్దులు, ఆర్థిక బిల్లులను ఆమోదించాయి. లోక్‌సభ ఈ బిల్లులను ఇదివరకే ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ 1నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించినట్లుయింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు పెరుగుతున్న ధరల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ, ద్రవ్యోల్బణం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందన్నారు, రాబోయే రోజుల్లో టోకు ధరల సూచీ తగ్గుముఖం పడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.