కొలంబో : శ్రీలంకలో ఉక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావం మరింతగా కడగండ్లను మిగిల్చింది. పలు ప్రాంతాలలో నిత్యావసర సరుకులు, అత్యవసర మందులకు కటకట ఏర్పడింది. దేశవ్యాప్తంగా రోజుకు పది గంటల కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇది అధికారిక కోతనే. అనధికారికంగా గ్రామీణ మారుమూల ప్రాంతాలలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరం అయింది. పలు చోట్ల కొవ్వొత్తుల వెలుగులతో బ్లాకౌట్ పరిస్థితి ఏ్పడింది. దేశ చరిత్రలో తాము ఇంతటి ఘోర ఆర్థిక పరిస్థితిని అంతకు మించిన జనజీవిత అస్థవ్యస్థతతను చవిచూడలేదని ప్రజలు వాపోతున్నారు. ఇది తమకు జీర్ణించుకోలేని చేదు అనుభవం అయిందన్నారు. కొన్ని ముఖ్యమైన దిగుమతులు దేశానికి అందుతున్నాయి.
అయితే విదేశీ కరెన్సీ నిల్వలు అడుగంటిపోవడంతో వాటిని తీసుకోలేకపోతున్నారు. జీవ రక్షక మెడిసిన్లకు కటకట ఏర్పడింది. అనేక ప్రాంతాలలో ఇంధనం కోసం జనం బారులు తీరుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని, జనం బతకలేని స్థితికి వస్తున్నారని ఆవేదన వ్యక్తం అయింది. ఓ మహిళ కొలంబోలో కిరోసిన్ కోసం ఐదు గంటల పాటు క్యూలో వేచి ఉంది. తన వంటి పేదవారికి కిరోసిన్‌తో ఇంట్లో పొయ్యి వెలుగుతుందని, అయితే అది దొరకడం ఇప్పుడు గగనం అయిందని వాపోయింది. క్యూలలో చాలా మంది అలసిసొలసి సొమ్మసిల్లి పడిపోతున్నారు. తాను క్యూ నుంచి ఇక ఆసుపత్రికి చికిత్సకు వెళ్లాల్సి ఉంటుందని ఆ మహిళ తెలిపింది. భర్త కొడుకు పని కోసం వెళ్లారని తాను ఎర్రటి ఎండలో కిరోసిన్ కోటా కోసం ఎంతసేపు అయినా ఎదురుచూడాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేసింది.