జెనీవా : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం గత వారం 40 శాతం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వొ) వెల్లడించింది. అమెరికాలో తాజా మరణాలతో పాటు భారత్‌లో సవరించిన గణాంకాల ప్రకారం ఈ పెరుగుదల కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం విడుదల చేసిన నివేదిక వివరించింది. డిసెంబర్ నుంచి కరోనా కేసులు పెరుగుతున్న పశ్చిమ పసిఫిక్ రీజియన్‌తోపాటు ప్రతిచోటా తాజా కరోనా కేసుల సంఖ్య తగ్గిందని వారం వారీ నివేదిక పేర్కొంది. గత వారం దాదాపు 10 మిలియన్ తాజా కేసులు, 45,000 కు పైగా మరణాలు నమోదయ్యాయని, అంతకు ముందు వారం మరణాల్లో 23 శాతం తగ్గుదల కనిపించిందని వివరించింది. అంతకు ముందటి వారంలో మరణాలు 33,000 నుంచి మరణాల సంఖ్య సవరించిన గణాంకాల వల్ల పెరిగిందని, మరణాల సంఖ్య నమోదు విషయంలో చిలీ, అమెరికా దేశాలతోపాటు అన్ని దేశాలు అప్రమత్తం అయ్యాయని డబ్లుహెచ్‌వొ పేర్కొంది. భారత్‌లో కరోనా మరణాలకు సంబంధించి మొదట్లో మహారాష్ట్ర నుంచి మరణాలు కలపలేదని, తరువాత 40,000 కు పైగా మరణాలు కలిపి మరణాల మొత్తం సంఖ్య సవరించారని వివరించింది.