వెల్లింగ్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 157 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. వర్షం వల్ల మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 37 ఓవర్లలో కేవలం 148 పరుగులకే ఆలౌటై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఆరంభంలోనే..
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ రశదా విలియమ్స్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ డాటిన్ ధాటిగా ఆడింది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న డాటిన్ ఐదు ఫోర్లతో 34 పరుగులు చేసింది. దీంతో విండీస్ 44 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ స్టెఫాని టెలర్, హేలీ మాథ్యూస్ కుదురుగా ఆడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మాథ్యూస్ రెండు ఫోర్లతో 34 పరుగులు చేసి వెనుదిరిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా విజృంభించారు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ విండీస్ ఇన్నింగ్స్‌ను 148 పరుగులకే పరిమితం చేశారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్టెఫాని 4 ఫోర్లతో 48 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. మిగతా వారు కనీసం రెండంకెల స్కోరును కూడా అందుకోలేక పోయారు. దీంతో విండీస్ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది.
కదంతొక్కిన హేన్స్, హీలీ
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు రాచెల్ హేన్స్, అలీసా హీలీలు శుభారంభం అందించారు. ఇద్దరు విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన హీలీ 107 బంతుల్లోనే 17 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 129 పరుగులు చేసి ఔటైంది. ఈ క్రమంలో హేన్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 216 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మరోవైపు హేన్స్ 9 ఫోర్లతో 85 పరుగులు చేసి పెవిలియన్ చేరిది. చివర్లో కెప్టెన్ మెగ్ లానింగ్ 26 (నాటౌట్), బేథ్ మూని 43 (నాటౌట్) రాణించడంతో ఆస్ట్రేలియా స్కోరు 305 పరుగులకు చేరింది.
Women’s ODI WC: AUS W beat WI W by 157 Runs