లోక్‌సభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా గురువారం ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభ నుంచి వాకౌట్ జరిపారు. పెట్రోలు డీజిల్, వంటగ్యాసు ధరలు పెరుగుతూ ఉన్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రభుత్వ నిర్వాకానికి నిరసనగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి నిష్క్రమించారు. నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో వారు సభలో గందరగోళం సృష్టించారు. మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన శృతి మించిందని, ఇంధన ధరల పెంపుదలతో ఇది పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. సభ్యులకు ఈ విషయంపై మాట్లాడటానికి ఇప్పటికే నాలుగుసార్లు అవకాశం ఇచ్చామని, వారు సీట్లకు వెళ్లాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే కోరారు. అయితే కీలకమైన అంశంపై ప్రభుత్వం దాటవేతకు యత్నిస్తోందని పేర్కొంటూ టిఆర్‌ఎస్, సిపిఎం, సిపిఐ, డిఎంకె సభ్యులు నిరసనలు వ్యక్తం చేయడంతో సభలో అరగంట సేపు వాదోపవాదాలు చెలరేగాయి. ఆ తరువాత ప్రతిపక్షాల వాకౌట్ జరిగింది.