పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల పోరుబాట
మన తెలంగాణ/హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు పోరుబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ధరల పెంపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై మండిపడుతూ కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిరసలకు దిగాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (విహెచ్) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు. గ్యాస్‌బండతో శవయాత్ర నిర్వహించిన నిరసన వ్యక్తపర్చారు. బిజెపి, టిఆర్‌ఎస్ పాలనతో వెనకటి రోజులు గుర్తుకొస్తున్నాయంటూ విహెచ్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సామాన్యుల నడ్డి విరస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఎల్బీనగర్‌లో సైతం కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించాయి.
కాంగ్రెస్ నేత మల్రెడ్డి రాంరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. గ్యాస్‌బండకు పూలమాల వేసి.. కార్యకర్తలు గుండు గీయించుకుని ఈ సందర్భంగా తమ నిరసనను తెలిపారు. ఓ వైపు రైతుల బతుకులు రోడ్డున పడేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ధరలు పెంచి సామాన్య జనం నడ్డి విరుస్తున్నాయని మల్‌రెడ్డి రాంరెడ్డి విమర్శించారు. ఇక హన్మకొండలో కాంగ్రెస కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. పార్టీ నేత నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు గ్యాస్ బండలకు పూలదండలు వేసి నిరసన వ్యక్తపర్చారు. వర్దన్నపేటలో వరంగల్‌ఖమ్మం జాతీయ రహదారిపై కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లతో బైఠాయించారు. సిరిసిల్ల గాంధీచౌక్‌లో గ్యాస్ బండలతో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కరీంనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు.. బిజెపి,టిఆర్‌ఎస్ పాలనలో ఆకాశాన్నంటి పేదల నడ్డి విరుస్తున్నాయని విమర్శలు గుప్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నప్పుడు 300 వున్న గ్యాస్ ధర ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలకు చేరిన పరిస్థితుల్లో మహిళలంతా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. పెంచిన ధరలు తగ్గించే దాకా.. ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేలా ఉద్యమాలు చేయాలని కోరుకుంటున్నానన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.
నిర్మల్ జిల్లా వెంగ్యాపేట్‌లో ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టామని మహేశ్వర్‌రెడ్డి అన్నారు. నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ శ్రేణులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలుకదం తొక్కాయి. బెల్లంపల్లిలో పెట్రోల్ బంకుకు పూలదండలు వేసి వినూత్న నిరసనను కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు చేపట్టారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ప్రజలను చైతన్యపర్చే విధంగా వినూత్న రీతిలో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు.