మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థలు రుణాల నిలిపివేతపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉచిత విద్యుత్ సరఫరాపై కూడా కేంద్రం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్లు సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. 17వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా సరఫరాకు సిద్ధంగా ఉన్నామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణాను ప్రోత్సహించాల్సిన కేంద్రం.. సవతి తల్లి ప్రేమ చూపుతుందన్నారు. రాష్ట్రానికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ సంస్థల రుణాలను రాకుండా కేంద్రం అడ్డుకోవడం దారుణమన్నారు. తెలంగాణపై కేంద్ర కక్షపూరిత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో.. తెలంగాణకు విద్యుత్ ఇవ్వొద్దని ఇతర సంస్థలను కేంద్రం బెదిరిస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా.. సిఎం కెసిఆర్ ఉన్నంత వరకు తెలంగాణ రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీల పాపం కేంద్రానిదే అని ఆయన చెప్పారు. బొగ్గు దిగుమతుల ధరలు, పెట్రో, డీజిల్ చార్జీలు పెరగడంతో పాటు.. కేంద్రం అడ్డగోలుగా పన్నులు విధించడం వల్లే తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి కేంద్రాన్ని నిలదీస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు.
Jagadish Reddy slams Centre over Power