మాస్క్‌లు తప్పనిసరి కాదు
ముంబయి: దేశంలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గిన దృష్టా ఈ నెల 31నుంచి కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి.గతంలో కొవిడ్ విజృంభణ కొనసాగిన మహారాష్ట్రలో ఇప్పుడు కేసులు గణనీయంగా తగ్గడంతో ఏప్రిల్ 2నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కొవిడ్ ప్రారంభంలో తీసుకువచ్చిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని గురువారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే వెల్లడింఆచరు. అలాగే మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని చెప్పారు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు ఇకపై ముంబయి లోకల్ రైళ్లలో ప్రయాణించవచ్చని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. శనివారం( ఏప్రిల్2)నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. అయితే బలవంతపు నిబంధనలు ఎత్తేస్తున్నామంటే దానర్థం ప్రజలు జాగ్రత్తలు పాటించవద్దని కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం, టాస్క్‌ఫోర్స్ కమిటీతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
బెంగాల్ కూడా..
అదే బాటలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా గతంలో కొవిడ్ వ్యాప్తి కట్టడికి విధించిన అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా రాత్రి 11 గంటలనుంచి ఉదయం 5 గంటల మధ్య వాహనాల రాకపోకలపై ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేయాలని నిర్ణయించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆంక్షలను మాత్రం కొనసాగించనున్నట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది.