ఇక్కడి ముగ్గురు తొత్తుల సాయం
దేశం కోసం చివరి వరకూ పోరు
రాజీనామా చేసేది లేదు ఓడితే పోతా
బలపరీక్ష ఉత్కంఠ నడుమ ఇమ్రాన్
జాతిని ఉద్ధేశించి ఉద్వేగ ప్రసంగం
అమెరికాపై పరోక్షంగా నిప్పులు
ఇస్లామాబాద్ : తమ ప్రభుత్వ కూల్చివేతకు విదేశీ కుట్ర సాగుతోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఆదివారానికి వాయిదా పడ్డ దశలో ఆయన గురువారం టీవీల ద్వారా జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ఇక్కడికి చెందిన ముగ్గురు విదేశీ శక్తుల తొత్తులుగా మారారు. ప్రభుత్వాన్ని సాగనివ్వకుండా చేయడమే వీరి సంకల్పం అని ఇమ్రాన్ మండిపడ్డారు. విదేశీ శక్తులకు ఇక్కడి వారు సహకరిస్తున్నారని తెలిపారు. వారి పేర్లను వెల్లడించలేదు. తనకు సంబంధిత విషయాలపై పూర్తి సమాచారం విదేశాల నుంచి అందుతోంది. ఇమ్రాన్ దిగిపోతే అంతా సర్దుకుంటుందని వారు చెపుతున్నారని, వీరి కక్ష అంతా తనపైనే అని ఆరోపించారు. తనను దింపేందుకు అమెరికా యత్నిస్తోందని ఆయన పరోక్షంగా పేరు చెప్పకుండా ఆరోపించారు. తాను బలపరీక్షకు ముందు రాజీనామా చేసే ప్రసక్తే లేదని, సభలో ఓటింగ్ ఘట్టం అంతా తేలుస్తుందని తేల్చిచెప్పారు.
ప్రతిపక్షాలతో రాజీ యత్నాలకు దిగుతూ దిగువ సభ రద్దు ఆఫరు ఇస్తూ ఇమ్రాన్ విదేశీ శక్తుల గురించి మాట్లాడారు. తన స్థానంలో ఓ వ్యక్తిని తీసుకువచ్చి కూర్చోబెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ఆదివారం అవిశ్వాసంపై ఓటింగ్‌ను ప్రస్తావిస్తూ అదేరోజు దేశ భవిత ఏమిటనేది తేలుతుందని చెప్పారు.తాను చివరి వరకూ ఓటమిని అంగీకరించేవాడిని కానని, ఈ దేశ గౌరవ ప్రతిష్టలు నిలిపేందుకు తాను రాజకీయాధికారంలోకి వచ్చానని అంతకు మించి ఏమీ లేదన్నారు. రాజకీయాలు తనకు కొత్త అని , తాను కావాలని రాజకీయాలలోకి రాలేదని, ఇది అల్లా ప్రేరణతో జరిగిన ఘటన అని తేల్చారు. పాకిస్థాన్ ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. తనకు దేవుడు అన్ని ఇచ్చాడని తనకు దేశ విదేశాలలో మంచి స్నేహితులు ఉన్నారని, అయితే తనకు దేశం మిన్న అని తెలిపారు. ఈ దేశం తనకు అన్ని ఇచ్చిందని, ఇందుకు రుణపడి ఉంటానని పాకిస్థాన్ తనకన్నా ఐదేళ్లు పెద్దదని చెప్పారు. తన చిన్ననాట ఎంతో గౌరవప్రదంగా ఉన్న పాకిస్థాన్ కొందరు పాలకుల స్వార్థ బుద్ధితో విదేశాల స్వీయ ప్రయోజనాలతో చితికి పోయిందని, ఇప్పుడు పాకిస్థాన్ అనేక అవమానాలు అనుభవిస్తోందని అన్నారు.