తిరువనంతపురం: కేరళ సిఎం పినరయి విజయన్ పాలనను వ్యతిరేకిస్తూ సీపిఐ మావోయిస్టుల పేరిట కేరళలో పోస్టర్లు వెలిశాయి. కొరికోడ్ జిల్లా మట్టికున్ను ప్రాంతంలో ఆదివారం ఈ పోస్టర్లు కనిపించాయి. ఈ జిల్లాలో దాదాపు 17 పోస్టర్లను మావోయిస్టులు అతికించినట్టు పోలీసులు చెప్పారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ సిల్వర్‌లైన్ సెమీహైస్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్ట్ చేపడుతూ కేరళ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని పోస్టర్లలో మావోయిస్టులు విమర్శించారు. కేంద్రంలో నరేంద్రమోడీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాన్నే కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్ అనుసరిస్తోందని మావోయిస్టులు పేర్కొన్నారు. పోలీసులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. దాదాపు 530కిమీ పొడవున సాగే సిల్వర్‌లైన్ ప్రాజెక్టు వల్ల పరిసర ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని, భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతుండగా, ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఉద్యమాలు చేస్తున్నాయి.
Maoist Poster found in Kerala Against CM Vijayan