పుణే: బిజెపికి వ్యతిరేకంగా తాను యుపిఎ నాయకత్వ బాధ్యతలు తీసుకుంటాననే వార్తలను ఎన్‌సిపి అధ్యక్షులు శరద్ పవార్ ఖండించారు. ఇది నిరాధారమని ఆదివారం ఆయన స్పష్టం చేశారు. యుపిఎ ఛైర్మన్‌గా పవార్ పేరును ప్రతిపాదిస్తూ ఇటీవలే ఎన్‌సిపి యువజన విభాగం ఓ తీర్మానం వెలువరించింది. దీనితో పవార్ ఈ సారథ్యానికి అనుకూలంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. బిజెపి వ్యతిరేక కూటమికి కానీ యుపిఎకు కానీ తాను నాయకత్వం వహించబోవడం లేదని అయితే కేంద్రంలో బిజెపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావడానికి జరిగే ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పవార్ తెలిపారు. బిజెపిని దెబ్బతీసేందుకు అవతరించే ఏ కూటమికి అయిన తమ సహకారం ఉంటుందని, సారధ్యం జోలికి వెళ్లడం లేదని ఈ సీనియర్ నేత స్పష్టం చేశారు. బిజెపికి కేంద్రంలో ప్రత్యామ్నాయ వేదిక ఏదీ కూడా కాంగ్రెస్ లేకుండా ఉండరాదని, కాంగ్రెస్ కలిసివస్తేనే ప్రతిపక్ష సంఘటిత శక్తి ఇనుమడిస్తుందని, ఇతర ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పట్ల సానుకూలతను వ్యక్తం చేయాల్సి ఉందని, ప్రతిపక్ష ఐక్యత లేకపోవడం బిజెపికి కలిసివచ్చే అంశం అయిందన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు అయితే దేశవ్యాప్తంగా పురాతన పార్టీ వేళ్లూనుకుని ఉందని, దీనిని ఎవరూ కాదనలేరని పవార్ విశ్లేషించారు. కాంగ్రెస్‌కు ప్రతి పల్లెలో ఉనికి ఉంది. పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అటువంటి విస్తృతపార్టీ ప్రమేయంతోనే బిజెపికి ప్రత్యామ్నాయం సాధ్యం అవుతుందని పవార్ వివరించారు.
Not Interested in becoming UPA Chairman: Sharad Pawar